నరేంద్ర మోడీ దేశానికి వరగబెట్టిందేమీ లేదు..!!
ప్రజాస్వామిక చర్యలు చేపడితే ధర్మం, దేశం కోసమా
బీజేపీ నిరంకుశ వైఖరికి నిదర్శనం
అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన
డీసీసీ చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనరెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై(Rahul Gandhi) ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ, అసహన వైఖరికి నిదర్శనమని వనపర్తి డీసీసీ చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి(State Sports Authority Chairman Shivsena Reddy) మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌లో రాహుల్‌గాంధీపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం రాత్రి వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా నిర్వహించారు.
నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి డిసిసి చీఫ్ శివసేనరెడ్డి, శాసనసభ్యులు మేఘారెడ్డి లు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి, బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి, డిసిసి జిల్లా అధ్యక్షులు శివసేనారెడ్డి లు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రశ్నించినందుకు కేసులు పెడతారా బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడి గొంతును అణచివేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని అన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘటనపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు.
సామాజిక వివక్ష, అంటరానితనం, సమానత్వం, రాజ్యాంగ హక్కుల వంటి అంశాలపై ప్రశ్నించడం నేరం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఆ హక్కును కాలరాయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ప్రశ్నించిన రాహుల్‌గాంధీపైనే కేసు పెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షాన్ని రాజకీయ శత్రువుగా కాకుండా ప్రజాస్వామ్యంలో కీలక భాగస్వామిగా చూడాలని వారు హితవు పలికారు.
దేశంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని వారు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లు, బెదిరింపులతో రాహుల్‌గాంధీ గొంతును అణచలేరని.. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఆపలేరని వారు స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వివాదానికి సంబంధించిన అంశంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. గ్రామ మండల జిల్లా కేంద్రాలల్లో దళితులకు జరుగుతున్న అవమానాలపై యావత్ దళిత సామాజిక వర్గం ఉద్యమించాలని వారు సూచించారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సాయి చరణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మం, చీర్ల జనార్దన్ సాగర్, మున్సిపల్ చైర్మన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ధనలక్ష్మి, విజయలక్ష్మి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆదిత్య, వివిధ మండలాల అధ్యక్షులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






