వ్యయం లెక్క చెప్పింది 137 అభ్యర్థులే..
పోటీ చేసిన అభ్యర్థులు 176
ముగిసిన ఎన్నికల ప్రచార వ్యయ సమర్పణ గడువు
ఈసీ తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి
సంగారెడ్డి, మార్చి 31(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ప్రచార వ్యయం వివరాలు సమర్పించే గడువు ముగిసింది. ఇందులో ఓడిన వారి తో పాటు గెలిచిన అభ్యర్థులు కూడా ఉండ డం గమనార్హం. మున్సిపల్ అధికారులు వారికి ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. గడువులోపు స్పందించని వా రిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
39 మంది ఇంకా ఇవ్వలేదు...
సంగారెడ్డి మున్సిపాలిటీకి ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగాయి. పట్టణంలోని 38 వార్డులకు గాను 176 మంది పోటీ చేశారు. ఫలితాలను అదేనెల 13న ప్రకటించారు. ఈసీ నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఫలితాలు వెల్లడైన నుంచి 45 రోజుల్లోగా తమ ప్రచార వ్యయ వివరాలు విధిగా అందజేయాల్సి ఉంటుంది. గడువు ఈనెల 27తో ముగిసింది. మరో రెండు రోజులను అనగా ఈనెల 29 వరకు పొడిగించింది. అయితే ఇప్పటి వరకు 137 మంది మాత్రమే ఈసీ నిర్ధేశిత ప్రొఫార్మాలో అందజేశారు. మరో 39 మంది అందజేయాల్సి ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
చర్యలపై ఆసక్తి...
పోటీ చేసిన అభ్యర్థులకు మున్సిపల్ అధికారులు ఈసీ నిర్ధేశిత ప్రొఫార్మాను ఉచితంగా అందజేశారు. ఆ ప్రకారం వివరాలు అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా లెక్కలు రాసినా, గడువులోపు సమర్పించకున్నా పదవిలో ఉన్నవారు అనర్హతలకు గురయ్యే అవకాశముంటుంది. ఓటమిపాలైన వారు భవిష్యత్తులో మూడేళ్ళపాటు ఏ ఎన్నికల్లో పోటీ చేసే వీలుండదు. దీనిపై అధికారులు నామినేషన్ సమయంలోనే అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈసీ నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారా మరింత గడువు ఇస్తారా వేచి చూడాలి.
ఈసీ ఆదేశానుసారం చర్యలు...
గడువులోపు ఎన్నికల ప్రచార వ్యయ వివరాలు సమర్పించని వారి నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తాం. చర్యలు తీసుకుంటారా లేదా గడువు పొడగిస్తారా అనేది ఈసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తదుపరి ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్




