ఒక్క మాత్ర.. ఆరోగ్యానికి భరోసా!
నేడు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం
1 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ఏర్పాట్లు
పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలకు ప్రధాన కారణమైన నులిపురుగుల నివారణకు ప్రభుత్వం మరోసారి శ్రీకారం చుట్టింది. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం (నేడు) 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, మదర్సాలు, చైల్డ్‌కేర్ సెంటర్లలో మాత్రల పంపణీకి వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది.
పిల్లలు తరచూ కడుపునొప్పి, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, రక్తహీనత, నీరసం, కాళ్లు లేదా ముఖం ఉబ్బడం, మలద్వారం చుట్టూ దురద వంటి సమస్యలతో బాధపడితే కడుపులో నులిపురుగులు ఉన్నట్లు అనుమానించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటిని అంతం చేయటానికి భారత ప్రభుత్వం 2015 నుంచి ఏటా రెండు దఫాలు ఆరు నెలలకు ఒకసారి డీ పోగ్రాం చేపట్టి నిర్దేశిత వయసు పిల్లలందరికీ మాత్రలు వేస్తుంది.
నులి పురుగులు ఎలా వ్యాపిస్తాయి?
అపరిశుభ్రమైన పరిసరాలు, బహిరంగ మలవిసర్జన, కలుషితమైన నీరు, పరిశుభ్రత లేని ఆహారం, చేతులు సబ్బుతో కడుక్కోకపోవడం, చెప్పులు లేకుండా మట్టిలో తిరగడం, పెరిగిన గోళ్లను శుభ్రంగా ఉంచకపోవడం వల్ల నులిపురుగుల గుడ్లు శరీరంలోకి చేరుతాయి.
మూడు రకాలు: నులి పురుగుల్లో మూడు రకాలు ఉంటాయి. ఏలికపాములు (రౌండ్ వార్మ్), నులి పురుగులు (పిన్‌వార్మ్), కొంకి పురుగులు ( హుక్ వార్మ్). ఇందులో ఏలిక పాములు-- పేగుల్లో పోషకాలను గ్రహించి అజీర్తి, కడుపునొప్పి, పోషకాహార లోపానికి కారణమవుతాయి. నులిపురుగులు --మలద్వారం చుట్టూ దురద, రాత్రివేళల్లో అసౌకర్యం కలిగిస్తాయి. కొంకిపురుగులు --పాదాల చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి రక్తాన్ని పీల్చడం వల్ల రక్తహీనత, ఎదుగుదల లోపానికి కారణమవుతాయి.
మాత్రలు ఎవరికి వేస్తారు?
1--5 ఏళ్ల పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో, 6 ఏళ్ల విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, మదర్సాలు, కళాశాలల్లో, బడికి వెళ్లని పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలు, అనాథాశ్రమాలు, చైల్డ్‌కేర్ సెంటర్లలోని పిల్లలకు మాత్రలు అందిస్తారు. సోమవారం మాత్రలు తీసుకోలేని వారికి ఈనెల 20న పంపిణీ చేస్తారు.
ఎలా తీసుకోవాలి?
ఆల్బెండజోల్ మాత్రను నేరుగా మింగకుండా బాగా నమిలి మింగాలి. 1--2 ఏళ్ల పిల్లలకు -- సగం మాత్ర (200 మి.గ్రా.) పొడి చేసి నీటితో ఇవ్వాలి. 2--19 ఏళ్ల పిల్లలకు -- పూర్తి మాత్ర (400 మి.గ్రా.) భోజనం తర్వాత నమిలి మింగాలి. దీర్ఘకాలిక జబ్బులతో మందులు వాడుతున్న పిల్లలు వైద్యుల సలహాతో మాత్రమే మాత్ర తీసుకోవాలి. ఖాళీ కడుపుతో మాత్ర వేయరాదు. నులిపురుగుల ప్రభావం ఎక్కువగా ఉన్న పిల్లల్లో మాత్ర వేసుకున్న తరువాత వికారం, స్వల్ప కడుపునొప్పి, వాంతులు కలిగే అవకాశం ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదని, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించాలని వైద్యారోగ్య సిబ్బంది సూచిస్తున్నారు. మాత్రను నేరుగా మింగకుండా నమిలి మింగితే పనితీరు బాగుంటుందని పేర్కొన్నారు.
నివారణే ఉత్తమ మార్గం: చెప్పులు ధరించడం, సురక్షితమైన తాగునీరు ఉపయో గించడం, భోజనం ముందు, మలవిసర్జన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవడం, మరుగుదొడ్లను వినియోగించడం, గోళ్లు కత్తిరించుకోవడం, కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడిగి తినడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు.
అందరి బాధ్యత
పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి అర్హత గల చిన్నారికి ఆల్బెండజోల్ మాత్ర అందేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. ఒక్క మాత్రతో వేలాది నులిపురుగులను నిర్మూలించి పిల్లలకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన బాల్యాన్ని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
నాశబోయిన నరసింహ, ఆరోగ్య విస్తరణ
అధికారి (హెచ్‌ఈఓ),






