27 May, 2026 | 2:41 AM

వృద్ధులపై వడ‘దెబ్బ’..!

27-05-2026 01:56 AM

ఎండలకు రాలిపోతున్న పండుటాకులు 

ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతున్న మృతుల సంఖ్య

మహబూబాబాద్, మే 26 (విజయక్రాంతి): మండుటెండలకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అనేకమంది వృద్దులు పండుటాకుల్లా రాలిపోతున్నారు. ఈనెల 21 నుండి ఉష్ణోగ్రతలతో పాటు వృద్ధుల మరణాల రేటు కూడా అదే సంఖ్యలో పెరుగుతోంది. ఉగ్ర భానుడి ఆగ్రహజ్వాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడదెబ్బకు గురై ఇప్పటివరకు 50 మందికి పైగా వృద్ధులు మృత్యువాత పడ్డట్టు బంధువులు పేర్కొంటున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 20 నుండి ఎండ తీవ్రత 40 డిగ్రీల నుంచి 46 డిగ్రీలకు పైగా పెరిగింది. దీనితో ఎండ తీవ్రత అధికమై వడదెబ్బ బాధితుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. వివిధ వృత్తుల్లో కొనసాగే వారు, వృద్ధులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతున్నారు. ఇందులో కొందరు యువకులు, మధ్య వయస్కులు మృత్యువాత పడుతుండగా, అధికంగా వృద్ధులు ఎండ వేడిమి తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. చాలామంది ఎండ దెబ్బకు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

ఈనెల 20న వడదెబ్బకు గురై అర్పణపల్లికి చెందిన నేరెళ్ల సోమయ్య (75), నేల పోగులకు చెందిన పల్నాటి బిక్షపతి (65) ఇద్దరు వృద్ధులు మరణించారు. 21న కొత్త ఇరుసులాపురంకు చెందిన లచ్చమ్మ (89), ఏటూరు నాగారం, మాదిరి లక్ష్మి (85), కల్వల, గాదె కొమురమ్మ (95) మరణించారు. 22న డోర్నకల్ బంజర కు చెందిన నన్నెబోయిన సత్యం (71), మచ్చర్ల, భద్రమ్మ (60), మేడిపల్లి, లక్ష్మయ్య (60), శంకర్రావు పల్లి, గాదె సమ్మక్క (65) మరణించారు.

ఇక 23న రంగసాయి పేటకు చెందిన చిలువేరు సారమ్మ (85), గూడూరు, పెసర వీరమల్లు (70) కడగుట్ట తండా, మాన్సింగ్ (74 ), మల్లక్కపల్లి, మనుపాటి ఎల్లయ్య (63), పెంచికలపేట, కొమురయ్య (101), రామచంద్రుని పేట, ఊటుకూరి సోమిరెడ్డి (78), జనగామ, జ్యోతి (70), వంగపల్లి, లచ్చమ్మ (82), వెంకటాపూర్, దుగ్యాల ప్రమీల (70), అయినవోలు, చిన్న మల్లయ్య (90), కక్కిరాల పల్లి, శాంతమ్మ (90), నీలమ్మ (80), కాటారం, దుర్గం అంకయ్య (65) మరణించారు.

24న వర్ధన్నపేటకు చెందిన చందు ఐలయ్య (88), ఇల్లంద, వజ్రమ్మ (70), రంగసాయిపేట, తోటకూర బుచ్చి రామయ్య (65), నాగిరెడ్డిపల్లి, పెద్ద మల్లవ్వ (70), గాంధీనగర్, తూముల రాజయ్య (65), కాజీపేట దర్గా, పత్తి ఎల్లమ్మ (62), కేసముద్రం అజ్మీరా లచ్చ్య (77), అబ్బాపూర్, రేగుల సమ్మక్క (70), గుంటూరు పల్లి, ఎర్రబోయిన జయమ్మ (68), అమ్మాపురం, అత్తిలి రాము (60), టేకుల తండా, జాటోత్ బీమోజీ (85), కరుణాపురం, అన్నపురెడ్డి లక్ష్మీబాయి (80), నాంచారి మడూరు, సోమ నరసయ్య (65), నెల్లికుదురు, కొత్త రామయ్య (85), వీరగాని వీరమ్మ (80), ఇల్లంద కు చెందిన సుశీల (65) వడదెబ్బకు గురై మరణించారు.

25న దామెరకు చెందిన అంకుశావళి (68), మొండ్రాయి, తండ చేరాలు (75), దమ్మన్నపేట, అనసూర్య (75) మంగపేట, తాటి సత్యవతి (80), పాలకుర్తి, కామారపు విజయ్ (60) యశ్వంతపూర్, మారబోయిన పుల్లయ్య (80), స్టేషన్ ఘనాపూర్, నరసమ్మ, పడమర కోట, బొల్లం వీరమల్లు (68), ధర్మారం, అంకేశ్వరపు సమ్మక్క (70), నల్లబెల్లి, కన్నెబోయిన ఐలమ్మ (70) వడదెబ్బకు గురై ప్రాణాలు వదిలారు. ఇక మంగళవారం గూడూరు మండలం కొల్లాపురం కు చెందిన ఆరేద్ర ధనమ్మ (90) మరణించింది. ఎండ తీవ్రత కొనసాగుతుండడంతో వడదెబ్బ మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.