27 May, 2026 | 2:08 AM

ఆపరేషన్ రంగారెడ్డి

27-05-2026 01:36 AM
  1. డిజిటల్ అస్త్రంతో గులాబీ బాస్ సరికొత్త వ్యూహం!
  2. నేతలు చేజారినా క్యాడరే కొండంత అండ..
  3. స్థానిక సమరానికి బీఆర్‌ఎస్ శంఖారావం! 

రంగారెడ్డి, మే 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎస్) అధిష్టానం రూట్ మార్చింది. కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీని ఇనుమడింపజేసేందుకు సరికొత్త యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే సాంకేతికతను జోడించి ’డిజిటల్ సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని ఒక మహోద్యమంలా చేపట్టాలని గులాబీ బాస్ నిర్ణయించారు.

ఇప్పటికే  కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరుగ్యారంటీ పథకాలు విఫలం, అభివృద్ధి పేరిట చేపడుతున్న భూసేకరణ, ప్రభుత్వంలో  పెరిగిన అవినీతి,హైడ్రా పేరిట పేదల భూముల కూల్చివెతలు, హామలుకానీ రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం, రైతు సమస్యలపై బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపోరాటాలు చేస్తున్నారు. ఈ ఆందోళనలతో పాటు సంస్థాగతంగా బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ.. రంగారెడ్డి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్ఛార్జిలను నియమించి, క్షేత్రస్థాయి సమరానికి సై అంది.

ప్రతి బూత్కూ ఇద్దరు ‘డిజిటల్ సైనికులు’

డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించింది. నియోజకవర్గాల వారీగా నియమితులైన ఇన్ఛార్జిలకు త్వరలోనే పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. క్యాడర్ ఎంపిక అనంతరం ఈ ఇన్ఛార్జిలు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఇద్దరు చొప్పున క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేసి, వారికి డిజిటల్ నమోదుపై అవగాహన కల్పిస్తారు. ఈ బూత్ స్థాయి ’డిజిటల్ సైనికులు’ నేరుగా ప్రజల్లోకి వెళ్లి స్మార్ట్గా సభ్యత్వాలను నమోదు చేయనున్నారు.

చెక్కుచెదరని గులాబీ ఓటు బ్యాంక్

గత అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలోని శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, చేవెళ్ల స్థానాల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వంటి ముఖ్య నేతలు కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.ముఖ్య నాయకులు కొందరు స్వార్థంతో పార్టీ మారినప్పటికీ.. క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్ బలమైన ఓటు బ్యాంక్, క్యాడర్ మాత్రం చెక్కుచెదరలేదు.

ఇతర జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి ఇప్పటికీ గట్టి పట్టుంది. ఎల్బీనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రరెడ్డి, టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.

టార్గెట్ లోకల్ బాడీస్..

ప్రస్తుత డిజిటల్ సభ్యత్వ డ్రైవ్ ద్వారా త్వరలో జరిగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ నెట్వర్క్ను పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిహెచ్‌ఎంసి ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి,  జిల్లాపై మళ్లీ గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఇన్ఛార్జిలు క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం పై దృష్టి సారించారు. 

నియోజకవర్గాల వారిగా నియమితులైన ఇన్ఛార్జి పేరు..

1)  కల్వకుర్తి - సాయి చంద్ రజిని,

2) ఇబ్రహీంపట్నం- విప్లవ్ కుమార్

3)ఎల్బీనగర్ -మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్

4) మహేశ్వరం- నగేష్ ముదిరాజ్

5) రాజేంద్రనగర్- ఎమ్మెల్సీ వాణిదేవి

6) శేరిలింగంపల్లి -రావుల శ్రీధర్ రెడ్డి

7) చేవెళ్ల -ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

8) షాద్నగర్ -బైకాని శ్రీనివాస్ యాదవ్