బీఆర్‌ఎస్ సభలో ‘అప్పుల’ సెగ
- మాజీ ఎమ్మెల్యేపై కార్యకర్త తీవ్ర ఆరోపణలు
- పెద్దపల్లిలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఎదుటే బాధితుడి నిరసన
పెద్దపల్లి, జూన్ 7 (విజయ క్రాంతి): పెద్దపల్లిలో జరిగిన బీఆర్‌ఎస్ సభలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిపై సొంత పార్టీ కార్యకర్త చేసిన ఆరోపణలు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో తన వద్ద సుమారు రూ.23 లక్షలు ఖర్చు చేయించి, రెండేళ్లుగా తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆదివారం సుల్తానాబాద్ మండలానికి చెందిన తాలపల్లి మనోజ్‌గౌడ్ అనే కార్యకర్త మాజీ మంత్రి హరీశ్‌రావు ఎదురుగా బహిరంగంగా నిలదీశారు.
పార్టీ అధినేత తన్నీరు హరీశ్‌రావు పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో, మనోజ్‌గౌడ్ తన కుటుంబంతో సహా హాజరై తన గోడును వెళ్లబోసుకున్నారు. ఎన్నికల సమయంలో ఒక కొడుకులా భావించి, అప్పులు చేసి, మరీ పార్టీ కోసం, మాజీ ఎమ్మెల్యే కోసం పనిచేశాను. ఎల్‌ఈడీ స్క్రీన్లు, వాహనాల అద్దెలు, డ్రైవర్ల వేతనాలు వంటి కీలక బాధ్యతలు అప్పగించి, చివరకు ‘నన్ను రోడ్డున పడేశారు’ అని ఆయన కన్నీరుమున్నీరయ్యారు.
తన డబ్బులు అడిగితే గత రెండేళ్లుగా దాసరి మనోహర్‌రెడ్డి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యాయ త్నం చేసుకునే స్థాయికి చేరుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లేందుకు వేదిక వద్దకు దూసు కెళ్లగా, స్థానిక నాయకులు, పోలీసులు అతడిని అడ్డుకోవడంతో సభలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, తనను నమ్ముకున్న కార్యకర్తకే అన్యాయం చేశారనే ఆరోపణలు ఇప్పుడు పెద్దపల్లి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.






