అప్పులు పెరిగి, ఆభరణాలపై కన్నేసి..
వృద్ధురాలి దారుణ హత్య
కామారెడ్డి, జూన్ 15 : అప్పు తీర్చే మార్గం లేక వృద్ధురాలిని నగల కోసం హత్య చేశాడు ఓ వ్యక్తి. బాన్సువాడలో చోటుచేసుకుంటున్న ఈ ఘటన వివరాలు సీఐ కృష్ణ వెల్లడించిన ప్రకా రం... బాన్సువాడ పట్టణం తాడ్కోల్ శివారులో గల రెండు పడకల గదుల కాలనీలో తొడిమెల సాయిబాబా నివాసం ఉంటున్నాడు. అతను ఉంటున్న ఇంటి పైఅంతస్థులో ఉప్పరి సాయవ్వ(70) ఒంటరిగా ఉంటోంది. సాయిబాబా ఏ పని చేసేవాడు కాదు. సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ ఆటలు ఆడేవాడు. చాలావరకు డబ్బు లు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో అప్పులు చేశాడు. దాదాపు రూ.16లక్షల వరకు అప్పులు ఉన్నాయి.
పైఅంతస్థులో ఉన్న సాయ వ్వ గుర్తొచ్చింది. అప్పటికే ఆమె వద్ద రూ.20వేలు రుణం గా తీసుకున్న సాయిబాబా.. ఆమె ఒంటిపై గల నగల మీద కన్నుపడింది. ఈ నెల 11న అర్ధరాత్రి 12.30గంటలప్పుడు సాయవ్వకు ఫోన్ చేశాడు. ఇంట్లోవాళ్లు తలుపు తీయడం లేదని, ఆమె గదిలో పడుకుంటానని కోరాడు. ఆమె ఇంట్లోకి వెళ్లిన సాయిబాబా.. తెల్లవారుజామున ఆమె గాఢనిద్రలో ఉన్నట్టు గమనించి, వెంట తెచ్చుకున్న కత్తితో పొట్టలో పొడిచాడు. గొంతు కోశాడు. ఆ తర్వాత నగలు కాజేశాడు. కత్తిని పక్కనే ఉన్న మురుగు కాలువలో పడేశాడు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో కమ్మలు తాకట్టు పెట్టి రూ. 45,300 తీసుకున్నాడు. 12వ తేదీన సాయవ్వ హత్య విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధా రాలు సేకరించారు. సాయవ్వకు చివరి ఫోన్ కాల్ సాయిబాబాదే కావడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. కటకటాల పాలయ్యాడు.






