14 April, 2026 | 1:40 PM

ఫీజుల నియంత్రణపై త్వరలోనే నిర్ణయం

13-05-2025 01:28 AM

- ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా సర్కార్ బడులు

- విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తాం..

- రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మే 1౨ (విజయక్రాంతి): ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై త్వరలోనే రాష్ట్రప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని, విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి తీరుతామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం విద్యారంగంలో సంస్కరణలకు నియమితులైన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులతోపాటు తల్లిదండ్రులు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు విద్యావ్యవస్థను పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం మాత్రం విద్యాశాఖలో మార్పులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

మంత్రి వర్గ ఉపసంఘం ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై తల్లిదండ్రులు, సంబంధింత యాజమాన్యాల నుంచి అభిప్రాయాలు సేకరించిందని, ప్రభుత్వం త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని తేల్చిచెప్పారు. ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని వివరించారు.

సర్కార్ బడులపై తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచుతామని, వాటికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాస్థాయిలో డీఈవో, మండల స్థాయిలో ఎంఈవోలు నిత్యం క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని, సర్కార్ బడులను తనిఖీ చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.  విద్యార్థుల భద్రత విషయంలో విద్యాశాఖ  రాజీపడొద్దని సూచించారు. తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ప్రకటన లిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. 

2025 విద్యాసం వత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయస్థాయిలో వెయ్యి ప్లే స్కూళ్లను ప్రారంభి స్తామని తెలిపారు. మావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు యోగితారాణా, దేవసేన, హరిత, నర్సింహారెడ్డి, కృష్ణాదిత్య, ట్రస్మా ప్రతినిధులు ఎస్‌ఎన్ రెడ్డి, మధుసూదన్, హెఎస్పీఏ సంఘం నుంచి వెంకట సాయినాథ్, ఇస్మా ప్రతినిధులు సునీల్‌కుమార్, వైసీ చౌదరి, ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నుంచి అన్వర్ అహ్మద్, క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున బాలశౌరిరెడ్డి పాల్గొన్నారు.