వడదెబ్బతో రైతు మృతి
13-05-2025 01:29 AM
వడ్లకుప్పపైనే కుప్పకూలిన వైనం
మహబూబాబాద్, మే 12 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రంలో రైతు వడదెబ్బతో మృతిచెందిన ఘటన మహబూ బాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని పోచంపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రం లో సోమవారం జరిగింది. రామోజీ తండా కు చెందిన గుగులోత్ కిషన్ (51) ఈ నెల 8న సన్నవడ్లను కేంద్రానికి తీసుకెళ్లాడు. తేమశాతం 24 రావడంతో నిర్వాహకులు ఆరబెట్టాలని సూచించారు.
నాలుగు రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టిన కిషన్ ఆదివారం నిర్వాహకులకు చూపించగా 17 శాతం తేమ ఉన్నదని, ధాన్యాన్ని సోమవారం తీసుకుంటామని, ప్యాడి క్లీనర్‌తో శుభ్రపరచాలని సూచించారు. సోమవారం ఉదయం ధాన్యాన్ని శుభ్రపరుస్తుండగా ఒక్కసారిగా వడదెబ్బకు గురై మృతిచెందాడు.




