03-02-2026 12:37:42 AM
మద్యం మత్తు అతివేగంతో రెండు ప్రాణాలను బలిగొన్న లారీ డ్రైవర్
కొండాపూర్ కలాం లో తీవ్ర విషాదఛాయలు
వికారాబాద్, ఫిబ్రవరి-2: ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొనడంతో తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన సోమవారం వికారాబాద్ లో తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం సుమారు 07:40 గంటల సమయంలో, వికారాబాద్ పట్టణ పరిధిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన చకాలి లలయ్య (వయస్సు: 35 సం., వృత్తి: కూలీ) తన కుమారుడు చకాలి రిథిక్ (వయస్సు: 6 సం.) తో కలిసి మోటార్ సైకిల్ నంబర్ TS 34 6577 పై వికారాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు.
అదే సమయంలో వారి వెనుక చకాలి లలయ్య భార్య మేఘన తన కుమార్తె రిషిక (వయస్సు: 7 సం.) తో కలిసి తన స్కూటీ నంబర్ TS 34 J 5735 పై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో, వికారాబాద్ నుండి తాండూర్ వైపు వెళ్తున్న లారీ నంబర్ HR 38 Y 0333 క్రేన్ లోడ్తో ఉన్న లారీ డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ, ఎదురుగా వచ్చి ముందు వెళ్తున్న లాలయ్యా మోటార్ సైకిల్ను ఢీకొట్టి, అనంతరం స్కూటీని కూడా ఢీకొట్టాడు. దీంతో లారీ నియంత్రణ కోల్పోయి, లారీ మరియు క్రేన్ రెండు కింద పడిపోయి చకాలి లలయ్య మరియు అతని కుమారుడు రిథిక్ పై పడినాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, గాయపడిన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించిన అనంతరం, రిథిక్ బాలుడు ఉదయం 08:38 గంటలకు మృతి చెందినట్లు ప్రకటించారు. చికిత్స పొందుతూ చకాలి లలయ్య ఉదయం 10:37 గంటలకు మృతి చెందారు. విచారణలో, లారీ డ్రైవర్ ఎమ్.డి. షకీర్ (వయస్సు: 36 సం., తండ్రి పేరు: రుస్తం, నివాసం: హర్యానా రాష్ట్రం) మద్యం సేవించి వాహనం నడిపినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. బాధ్యత కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.