06-10-2025 12:45:46 AM
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ’కల్కి2’ ఒకటి. ’కల్కి2898ఏడీ’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కల్కి ఫస్ట్ పార్ట్ లో దీపికా పడుకొణె సుమతి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
కానీ, కల్కి సీక్వెల్ మేకింగ్ విషయంలో చాలా కండీషన్స్ పెట్టిందట దీపికా. అందుకే కల్కి రెండోభాగం నుంచి దీపికాను తొలగిస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. అప్పటినుంచి దీపికా స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సుమతి క్యారెక్టర్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను అనుకున్నారట. కానీ, చివరగా ఆ అవకాశం సౌత్ స్టార్ బ్యూటీ సాయిపల్లవిని వరించిందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ సాయిపల్లవితో చర్చలు జరిపారని సమాచారం. ఆమె కూడా వెంటనే ఒకే చెప్పేసిందని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.