అవకాశాల్లోనూ సగం
ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు, విజయాలను గౌరవించడంతో పాటుగా స్త్రీలపై హింస, వారికి సమాన హక్కులు మొదలైన అంశాలపై వాదించాల్సిన అవసరాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది. వాస్తవానికి ఒక కార్మిక ఉద్యమంనుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుట్టుకు వచ్చింది.1908లో అమెరికాలోని న్యూయా ర్క్ సిటీకి చెందిన 15వేల మంది మహిళలు పని గంటలు తగ్గించాలని, ఓటు వేసే హక్కు కల్పించాలని , అలాగే పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వాలని ప్రభుతాన్ని డిమాం డ్ చేస్తూ ఉద్యమాన్ని చేట్టారు.
అప్పుడు ఆ విషయం ప్రభుత్వానికి తెలియడంతో సంవత్సరం తర్వాత 1909లో సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. ఈ దినోత్సవం కేవలం ఒక దేశానికి చెందినది కాదని భావించిన జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ దీన్ని ప్రపంచస్థాయిలో అన్ని దేశాలకు చెందినదిగా ప్రకటించాలని పోరాటం చేశారు. ఈ క్రమంలోనే 1910లో కోపెన్‌హాగెన్ నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ కార్యక్రమంలో జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా దీన్ని మార్చాలని ప్రతిపాదించారు.
అప్పుడు సదస్సులో 17 దేశా లనుంచి వచ్చిన 100 మంది మహిళలు ఈ ప్రతిపాదనను అంగీకరించారు. అలా తొలిసారిగా 1911లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నారు.ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా.. ఇలా ఎన్నో దేశాల్లో ఈ మహిళా దినోత్సవం మొదలైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇప్పుడు ప్రతి ఏటా మార్చి 8న జరుపుకొంటున్నప్పటికీ మొదట్లో వేర్వేరు తేదీల్లో జరుపుకొనే వారు. 1917లో రష్యా మహిళలు మొదటి ప్రపంచయుద్ధం కారణంగా ముఖ్యంగా ఆహారం, ప్రశాంతత లేక తల్లడిల్లిపోయారు.
దీంతో వారంతా నిరసనకు దిగారు. వారి సమ్మె ప్రభావంతో రష్యా చక్రవర్తి నికోలస్ సింహాసనాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కు కల్పించింది. గ్రెగరిన్ క్యాలెండర్ ప్రకారం మహిళలు సమ్మెకు దిగిన రోజు మార్చి 8. అందుకే మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకోవడం మొదలుపెట్టారు. ఐరాస 1975లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం మొదలు పెట్టింది.
ఎన్నో పోరాటాల ఫలితంగా జరుపుకొంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఫలితంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. ఆకాశంలోనే కాదు.. అవకాశాల్లోనూ సగమని నిరూపించుకుంటున్నారు. ఓటుహ క్కు, కార్మిక హక్కులే కాకుండా మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తు న్నారు. నాటి ఫ్లో రెన్స్ నైటింగేల్ మొదలుకొని నేటిదాకా ఎంద రో మహిళామణులు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
చట్టసభల్లో ప్రాతినిధ్యంతో సరిపెట్టుకోని మహిళలు ఇప్పుడు దేశాలనే ఏలే స్థితికి ఎదిగారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, జర్మనీ మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సహా చాలామంది ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని నేతలుగా పేరు తెచ్చుకున్నారు. సరోజినీ నాయుడు, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్, అంతరిక్షంలో అడుగుపెట్టిన సునీతా విలియమ్స్ లాంటి వారు నేటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. విద్య, వైద్యం, ఐటి, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించిన వారూ ఉన్నారు. సుదీర్ఘ పోరాటం ఫలితంగా భారత్‌లోనూ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్ల్లుకు ఆమోదం లభించింది.
అయితే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మహిళలు గృహ హింస, లైంగిక వేధింపులులాంటి అనేక సమస్యలను రోజూ ఎదుర్కొంటున్నారు. మహిళా దినోత్సవం రోజు మొక్కుబడిగా సెమినార్లు, సభలు, నిర్వహించి తీర్మానాలు చేయడంతో సరిపెట్టుకోకూడదు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోసం ఉద్యమించినప్పుడే మహిళా దినోత్సవానికి సార్థకత లభిస్తుంది. అందుకోసం మహిళలే కాకుండా సామాజిక ఉద్యమ నేతలు, పౌర సంఘాలు ఉద్యమానికి నడుం బిగించాలి.






