24 April, 2026 | 7:42 PM

వివక్షత వద్దు

08-03-2025 12:00 AM

‘మహిళలే మహారాణులు’ అనే నానుడిని నిజం చేస్తూ వివిధ రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు అందరూ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు. పురుషులకంటే మేము ఎందులోనూ తక్కువ కాదని వారు చాటి చెబుతున్నారు. వారు మనుగడలోకి రావడమే కాకుండా చుట్టుపక్కల నలుగురికి కూడా దారి చూపుతున్నారు. అటువంటి మహిళామణులందరికీ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘విజయక్రాంతి’ శతకోటి వందనాలు సమర్పిస్తోంది. ఈ యేడు ప్రపంచాన్ని శాసించిన కొంతమంది మహిళలు...

ప్రపంచవ్యాప్తంగా 1978 నుంచి ఐక్యరాజ్యసమితి (ఐరాస) చొరవతో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారనే వాస్తవాన్ని మరువరాదు. అయితే, నేటికీ అనేక దేశాల్లో మగవారితో సమానంగా మహిళలకు సమాన అవకాశాలు లేవు. సరికదా అనేక విధాలుగా వివక్షత, అణిచివేతలకు గురవుతున్నారు. వెనుకబడిన దేశాల్లోనే కాక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మహిళలపై ఈ ధోరణులు ఉండడం గమనార్హం. అదే సమయంలో 2024 వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం, లింగ సమానత్వంలో ఐస్‌లాండ్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, స్వీడన్, జర్మనీ వంటి దేశాలు ప్రపంచంలోనే ముందువరుసలో ఉన్నాయి.

మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు పోతున్నామని, త్వరలోనే ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందుతున్నద ని చెబుతున్న నేటి పాలకుల పాలనలో మాత్రం లింగ సమానత్వంలో 129వ స్థానంలో ఉండటం గమనార్హం. మహిళలపై జరుగుతున్న జాతీయ క్రైం రేట్ సగటుకంటే దాదాపు మూడురెట్లు ఎక్కువగా దేశ రాజధాని ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్‌లో నమోదు కావడం ద్వారా దేశంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాల పూర్తవుతున్నా  ఏ రంగంలోనూ మహిళలు ఆశించిన స్థాయిలో అభివృధ్ధి చెందలేదనే విషయాన్ని గ్రహించాలి. ముఖ్యంగా చట్టసభల్లో ప్రాతినిధ్యమే అతి తక్కువగా ఉంటున్నది. తాజాగా 2024లో జరిగిన భారత పార్లమెంటు ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన మహిళా పార్లమెంటు సభ్యులు కేవలం 74 మంది అంటే 13.63 శాతంగా నమోదైంది. అంటే, 33 శాతం కేటాయించినా, దీంట్లో కనీసం సగం కూడా లేకపోవడం గమనార్హం. ఆర్జేడీ నుంచి ఒకే ఒక మహిళ ఎంపీగా ఎన్నికైనారు. కొన్ని పార్టీలు మహిళలకు టికెట్లయినా ఇవ్వడం లేదు. 

పాలకుల్లో లోపించిన చిత్తశుద్ధి

ప్రస్తుతం దేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో బీజేపీ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్నా ఒకే ఒక మహిళ సీఎం (ఢిల్లీ ముఖ్యమంత్రి) మినహా మరే రాష్ట్రంలోనూ మహిళా ముఖ్యమంత్రులు లేరు. మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంటు ఆమోదం పొందినా, అమలు మాత్రం వచ్చే లోక్‌సభ ఎన్నికలు 2029 నుంచి మాత్రమే అనడంలోనే నేటి పాలకుల చిత్తశుద్ధి అర్థమవుతున్నది. మన దేశంలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నా విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వెనుకబడి ఉన్నారు. దాదాపు 40 శాతం మంది మహిళలకు చదువు లేదు. కేవలం 17.8 శాతం మంది ప్రాథమిక విద్య అభ్యసించినట్లు నివేదికలు చెబుతున్నాయి. నేటికీ వర్క్ ఫోర్స్‌లో 32.8 శాతం మంది మహిళలే పాల్గొంటున్నారు. సుమారు నేటికీ 34.7 శాతం మహిళలు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

2023 మహిళా వర్క్ ఫోర్స్ నివేదికను పరిశీలించగా మన దేశం 32.7 శాతంతో ప్రపంచంలో 165వ స్థానంలో ఉంది. మన దేశంలో వేతన వ్యత్యాసాల్లోనూ మగవారి కంటే 64.24 శాతం మహిళలు వెనుకబడి ఉన్నారని వివిధ సర్వేలు చెబుతున్నాయి. దేశంలో హిమాచల్‌ప్రదేశ్‌లో 15 సంవత్సరాల మధ్య వయస్సు మహిళల్లో 76.6 శాతం మంది వర్క్ ఫోర్స్‌లో ముందువరుసలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 51.5 శాతం, తెలంగాణలో 50.4 శాతం పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం దేశంలో వర్క్ ఫోర్స్‌లో మగవారు 61 శాతం ఉండగా, మహిళలు 39 శాతం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

పట్టణ మహిళలకంటే గ్రామీణ ప్రాంతాల మహిళలు వర్క్ ఫోర్స్‌లో అధికంగా ఉన్నారు. అసంఘటిత రంగంలో ఎక్కువగా పని చేస్తున్నారు. శ్రమ దోపిడీ జరుగుతున్నది. మహిళా భద్రతా చట్టాలు నామమాత్రంగా అమలవుతున్నాయి. 

చట్టాలు సక్రమంగా అమలు కావాలి

మహిళలపై అధిక సంఖ్యలో దాడులు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమా చారం చెబుతున్నది. ప్రతీ సంవత్సరం సగటున దాదాపు ఐదు లక్షల కేసులు నమోదవుతున్నా యి. మహిళలపై దాడులు, హింస ఎక్కువగా భర్త, వారి కుటుంబసభ్యులపై నమోదవుతున్నాయి. వరకట్నం వేధింపులు తాళలేక అనేకమంది మహిళలు తనువులు చాలిస్తున్న వైనాలు కనిపిస్తున్నాయి. అఘాయిత్యాలు రోజురోజుకూ పెచ్చ రిల్లుతున్నాయి. కుల, మత వివక్షత, అణిచివేత ధోరణులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సమయంలో ప్రపంచ మహిళల అభివృద్ధికి ప్రత్యేక క్రృషి చేయాలి.

అంతర్జాతీయ సంస్థలు, అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా సామాజికంగా మహిళాభివృద్ధికి కృషి చేయాలి. యుద్ద సమయంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు దాడులనుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టాలి. వెనుకబడిన దేశాల్లోనేకాక గిరిజన, మైనారిటీ మహిళల రక్షణకు, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మన దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కఠిన చర్యలు చేపట్టాలి. దోషులను త్వరగా పట్టుకోవాలి. చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి. ఫోక్సో, నిర్భయ చట్టాలు, గ్రృహహింస నిరోధక చట్టం తదితరాలు సక్రమంగా అమలు చేయాలి. మహిళలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. 

ఐ.ప్రసాదరావు