11 August, 2026 | 3:06 AM

వివాదాస్పద స్థలంలో కూల్చివేతలు

11-08-2026 12:00 AM

పట్టించుకోని మున్సిపల్ శాఖ అధికారులు

నాగర్ కర్నూల్ ఆగస్టు 10 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రహత్ నగర్ కాలనీ నక్కోని వాగు పరిధిలోని మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన ఇన్ లెట్ వెల్( భావి) ప్రాంతాన్ని అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కూల్చివేయడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చాలా ఏళ్లుగా అదే ప్రాంతంలో మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన బావి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. నక్కొని వాగు నుండి కేసరి సముద్రం చెరువులోకి నీరు వెళ్లేందుకు వీలుగా ఉండేదని క్రమంగా అక్రమార్కులు నాలా ప్రదేశాన్ని కబ్జా చేస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టినప్పటికీ ఆ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. 

తాజాగా అదే ప్రాంతానికి సమీపంలో అధికార పార్టీకి చెందిన కొందరి స్థలాలు ఆనుకొని ఉండడంతో శని, ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో ఇదే అదునుగా భావించి కూల్చివేతలు ప్రారంభించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో సదరు వ్యక్తులు ఆ ప్రదేశం మాదేనంటూ చెప్తుండగా మున్సిపల్ అధికారులు మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తమకేమీ తెలియదంటూ బుకాయించడం విశేషం. గత ప్రభుత్వంలోనూ బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన అదే వర్గానికి చెందిన వ్యక్తులు హౌసింగ్ బోర్డ్ స్థలాలను కబ్జా చేస్తూ భవనం నిర్మించారని విమర్శలు ఉన్నాయి. కానీ అధికారులు  పట్టించుకోక పోవడం పట్ల భారీగా ముడుపులు అందుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.