జనసంద్రమైన నాగోబా
- భారీగా తరలివచ్చిన భక్తులు..
- జొన్న పేలాలు, ఇప్పపువ్వు, జొన్న గడక, సాంబారుతో నైవేద్యం.
ఉట్నూర్, ఆగస్టు 17 : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని ఆదివాసుల ఆరాధ్య దేవుడు నాగోబా జనసంద్రమైంది. శ్రావణమాసంలో మొదటి పండగగా జరుపుకునే నాగుల పంచమి పండగ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు హాజరై నాగోబాకు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు.
దర్శనానికి దాదాపుగా మూడు గంటలపైన వరుసలో భక్తులు నిలబడాల్సి వచ్చింది. ఆదివాసీ గిరిజనులు జొన్న పేలాలతోపాటు ఇప్పపువ్వును, జొన్న గడక, సాంబార్ నైవేద్యంగా టేకు ఆకులతో పాటు మోదుగు ఆకులలో సమర్పించారు. భక్తులకు మెస్రం వంశస్థులు నాగోభాకు సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా అందించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బందోబస్తును పర్యవేక్షిం చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉట్నూర్ ఏఎస్పీ రితిక్ సాయి కుట్టే, సీఐ మడవి ప్రసాద్, ఎస్త్స్ర సాయన్నలు బందోబస్తు ఏర్పాటు చేశారు.






