18 August, 2026 | 1:16 AM

నాగోల్‌లో మహంకాళి పోచమ్మ దేవతల ప్రతిష్ట మహోత్సవాలు

18-08-2026 12:00 AM

హాజరుకానున్న మంత్రులు 

నాగోల్ ఆగస్టు 17 (విజయ క్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ మహంకాళి, పోచమ్మ దేవతల నూతన ఆలయాల నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా రామాలయం కమిటీ, మహంకాళి- పోచమ్మ ఆలయాల కమిటీ, యూత్ కమిటీ ఆధ్వర్యంలో వారం రోజులు పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుటకు కమిటీలు సోమవారం నిర్ణయించాయి.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ... ఈనెల 23న (ఆదివారం) సాయంత్రం మహంకాళి అమ్మవారి, పోచమ్మ అమ్మవారి విగ్రహాల ఊరేగింపు నిర్వహించబడుతుందని తెలిపారు. 24న గణపతి పూజ మొదలైన పూజలు నిర్వహిస్తామన్నారు. 25న స్థాపిత దేవత పూజలు జరిపించబడతాయని తెలిపారు. 26న జగద్గురు పుష్పగిరి శంకరా భారతి స్వామి వారిచే మహంకాళి- పోచమ్మ దేవతల దివ్య విగ్రహాల ప్రతిష్టాపన నిర్వహించబడుతుందని అన్నారు.

అనంతరం మహా పూర్ణాహుతి జరిపి అలంకరణ, కుంకుమార్చన మహా నైవేద్యం మంగళహారతులు మంత్రపుష్పములు మొదలైన పూజలు అమ్మవార్లకు నిర్వహిస్తారని పేర్కొన్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, బీసీ వెల్ఫేర్ , ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.

తదుపరి గురువారం రోజున కాటమయ్య బోనాలు, ఆదివారం గ్రామ దేవతలకు బీరప్ప స్వామికి, హరిజన మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు. సోమవారం ఫలహారం బండి ఊరేగింపులు ఉంటాయని, భక్తులు బంధువులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నాగోల్ గ్రామం తరపున ఆయన కోరారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, పల్లె సీతారాములు గౌడ్, వస్పరి శంకర్, గోల్కొండ మైసయ్య, కొలన్ నరసింహ గౌడ్, నాగోలు సుధాకర చారి, చెరుకు ప్రశాంత్ కుమార్ గౌడ్, బద్దం రవీందర్ గౌడ్, పోచంపల్లి మనీష్ రెడ్డి, బద్దం రామకృష్ణ గౌడ్, పోచంపల్లి రాజేందర్ రెడ్డి, బద్దం ధనుంజయ్ గౌడ్, అనంతుల జితేందర్ రెడ్డి, ఎగ్గే కుమార్, కొలన్ చంద్రశేఖర్ ఆజాద్, చెరుకు చిరంజీవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.