కూలీలతో ఉప ముఖ్యమంత్రి భట్టి మాటా-మంతి
- గండగలపాడు మార్గంలో పొలాల్లోకి వెళ్లి భట్టి విక్రమార్క
- ఆనందంలో రైతు కూలీలు క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల ఆరా..
- ‘ఇందిరమ్మ ఇళ్లతో’ మా కలలు నిజమయ్యాయన్న మహిళలు
- కూలీల చెంతకు ‘ప్రజా ప్రభుత్వం
ఖమ్మం, జులై 16(విజయక్రాంతి): గండగలపాడు నుంచి స్నానాల లక్ష్మీపురం వెళ్లే మార్గమధ్యంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్ అకస్మాత్తుగా ఆగింది. భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యేలోపే, ఆయనే స్వయంగా రోడ్డు పక్కన పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతు కూలీల వైపు నడిచి వెళ్లారు. డిప్యూటీ సీఎం తమ వద్దకు రావడంతో కూలీలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వారితో చేతులు కలిపేందుకు, మాట్లాడేందుకు అక్కడి వారంతా పోటీలు పడ్డారు.
‘అక్కయ్యా.. పథకాలన్నీ అందుతున్నాయా?’
పొలం గట్టుపై నిలబడి, కూలీలతో ఎంతో ఆత్మీయంగా భట్టి విక్రమార్క ముచ్చటించారు. నేరుగా లబ్ధిదారులతోనే సంక్షేమ ఫలాల తీరును అడిగి తెలుసుకున్నారు.
డిప్యూటీ సీఎం అడిగిన ప్రశ్నలివే..
‘అక్కయ్యా! మన ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయా?‘
* ‘మీ ఇంటికి ఉచిత విద్యుత్ సరఫరా వస్తోందా?‘
‘రేషన్ షాప్ నుంచి సన్న బియ్యం తెచ్చుకుని తింటున్నారా?‘
‘అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయా?‘
ఈ ప్రశ్నలకు కూలీలు ఎంతో సంతోషంగా స్పందిస్తూ.. ‘ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ మాకు అందుతున్నాయి సార్.. ముఖ్యంగా మాలాంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది‘ అని తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఉపముఖ్యమంత్రి దృష్టికి ‘రవాణా’ కష్టాలు
ఇదే సమయంలో కూలీలు తమ రోజువారీ ఇబ్బందులను కూడా డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైరా నుంచి ముసలిమడుగు వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. బస్సు సౌకర్యం కల్పించాలని వారు కోరారు. దీనిపై ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సాధారణంగా నాయకులు వేదికల పైనుంచి మాట్లాడటం చూస్తాం. కానీ, ఇలా స్వయంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా.. కాన్వాయ్ ఆపి, పొలంలోకి వెళ్లి కూలీల కష్టసుఖాలు తెలుసుకోవడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ’ప్రజా ప్రభుత్వం’ అంటే ఇదేనంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






