21 July, 2026 | 11:23 AM

సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ ప్రభుత్వ గుర్తింపు

21-07-2026 12:00 AM

బంజారాహిల్స్, జూలై 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల కోసం సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్‌ను అధికారిక క్రీడా విజ్ఞాన, క్రీడా వైద్య కేంద్రంగా (స్పోర్ట్స్, సైన్స్ -స్పోర్ట్స్ మెడిసిన్) తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయమై రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. క్రీడాకారుల ఆరోగ్యం, క్రీడల్లో వారి ప్రదర్శనను మెరుగుపరచడానికి సంస్థ దోహదపడుతోందన్నారు.

అంతేకాకుండా దేశీయంగా మొట్టమొదటి టెక్-ఇంటిగ్రేటెడ్ అడ్వానస్డ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ ప్లాట్ఫామ్గా ఇది నిలుస్తోందన్నారు. రాష్ట్ర క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏటీజీ), యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోరట్స్ యూనివర్సిటీలతో కలిసి సెంటర్ పనిచేయాలని పేర్కొన్నారు.

నార్డిక్ హెల్త్ ఫిన్లాండ్, వాల్ పెర్ఫార్మెన్స్ ద్వారా సంస్థకు అందుతున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, క్రీడా వైద్యం, పునరావాసం (రిహాబిలిటేషన్), అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడాకారుల పనితీరు సామర్థ్యాలను ప్రశంసించారు. ఈ సహకారం తెలంగాణలో క్రీడాకారుల కోసం ఒక సమగ్రమైన మద్దతు వ్యవస్థను నిర్మించడంలో ఒక ముఖ్యమైన ముందడుగని అభిప్రాయపడ్డారు. దేశంలోనే క్రీడా వైద్య రంగాన్ని ఇది గణనీయంగా ముందుకు తీసుకువెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.