పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ
క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చుతాం
2035 నాటికి 26 వేల మెగావాట్ల సోలార్, 8 వేల మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యమే లక్ష్యం
ఇండియా ఎనర్జీ సమ్మిట్ ఎక్స్ పో2026లో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల పెట్టుబడిదారులను ప్రోత్సహించే స్వర్గధామమని, క్లీన్ ఎనర్జీ రంగానికి నిలయంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్, నోవాటెల్‌లో రెండు రోజుల పాటు జరగనున్న ‘ఇండియా ఎనర్జీ సమ్మిట్ ఎక్స్ పోలై2026’ను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మన సమృద్ధిని పంచుకోవడానికి పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సీఈఓలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణను కేవలం స్వచ్ఛమైన ఇంధనాన్ని వినియోగించే రాష్ట్రంగా మాత్రమే కాకుండా, ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగానికి అవసరమైన సాంకేతికతలను తయారు చేసే ప్రధాన కేంద్రంగా నిలపాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుంటూనే, పర్యావరణ పరిరక్షణను సాధించేలా ప్రణాళికలు రూపొందించామని వివరించారు.
ఇందులో భాగంగా 2030 నాటికి 20 వేల మెగావాట్లు, 2035 నాటికి 26 వేల మెగావాట్లకు పైగా సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపారు. అలాగే పునరుత్పాదక ఇంధనానికి అత్యంత కీలకమైన ‘విద్యుత్ నిల్వ’ సామర్థ్యాన్ని కూడా భారీగా విస్తరిస్తున్నామని చెప్పారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా 2030 నాటికి 3,800 మెగావాట్లు, 2035 నాటికి 8 వేల మెగావాట్ల నిల్వ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌లోని ఐటీ, ఏఐ నైపుణ్యాలను ఉపయోగించి భవిష్యత్తు విద్యుత్ గ్రిడ్‌ను డిజిటల్ నెట్‌వర్క్‌గా మారుస్తున్నామని పేర్కొన్నారు.
‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్ కోసం ప్రత్యేకంగా 100 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్లాంట్‌ను అనుసంధానిస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు 2030 నాటికి ఏటా 4 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, 2035 నాటికి 12 వేల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సోలార్, విండ్, బ్యాటరీ ఉత్పత్తులను ఇక్కడే తయారు చేసే కంపెనీలకు మూలధన సాయం, విద్యుత్ సుంకం మినహాయింపులతో పాటు వాటికి వేగవంతమైన అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతోనే ఈ ఇంధన విప్లవం సాధ్యమవుతుందని, తెలంగాణతో కలిసి నడవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.






