అరాచకాలకు శిక్ష తప్పదు!
- పోలీసులను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, బీజేపీ ఎంపీ అరవింద్ బూతులు తిట్టినా కేసులు పెట్టరా?
- కాంగ్రెస్ పార్టీది దిగజారుడు రాజకీయం
- రైతు భరోసా ఇవ్వవు కానీ.. గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి ఇస్తావ్?
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ఆదిలాబాద్ జైలులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో ములాఖత్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మరో రెండేళ్లలో మేమే అధికారంలోకి వస్తాం. సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకో అప్పుడు నీకు కూడా చిప్పకూడు తినే పరిస్థితి వస్తుంది’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రజల తీర్పుతో మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌పై కాంగ్రె స్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
త్వరలో కేసీ ఆర్ సీఎం అవుతారని, తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోమని, ఎక్కడ దాకున్నా బయటకు లాక్కొస్తామని హెచ్చరించారు. మంగళవారం ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయన జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో ములాఖత్ అయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా కోసం డబ్బులు లేవుకానీ, గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని సీఎం చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎవడబ్బ సొమ్మని పంపిస్తావ్ అని మండిపడ్డారు.
సీఎం ఇలా మాట్లాడుతున్నా కేంద్రంలోని బీజేపీ, ఈడీ సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు చేసినా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని, తమ పార్టీ అభ్యర్థులను బెదిరించడం, భయపెట్టడం, దాడులు చేశారని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసే విధంగా అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చేసిన అరాచకాలను, దుర్మార్గాలను రాష్ట్రం గమనించిందని వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు 10 స్థానాలు, తమతో పొత్తులో ఉన్న సీపీఐకి 4 స్థానాలు- మొత్తం 14 స్థానాలు వస్తే అధికారం తమకు దక్కకుండా కాంగ్రెస్ అరాచకాలు చేస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు స్థానిక మంత్రి వివేక్, అధికార యంత్రాంగం ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. రంగారెడ్డిలోని ఇబ్రహీంపట్నంలో కూడా ఇదే రకమైన అరాచకాన్ని కాంగ్రెస్ చేసిందన్నారు.
జనగామలో కూడా దళిత మహిళా కౌన్సిలర్‌ను చేయి పట్టి అసభ్యంగా ప్రవర్తించారన్నారు. క్యాతనపల్లిలో ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ కౌన్సిలర్లు లొంగకుండా నిలబడితే, తమ మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించి దాడికి దిగారని ఆరోపించారు. అక్కడే ఉన్న మంత్రి గానీ, ఎంపీ గానీ నవ్వుకున్నారే తప్ప, నిలువరించే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ఇంత దిగజారుడు రాజకీయం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరిగి ఉండదని విమర్శించారు.
కాంగ్రెస్ అరాచకాలను, అధికారుల అక్రమాలను ప్రశ్నిస్తే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు మూల రాజిరెడ్డిని, ఇంకొంత మంది పార్టీ నేతలను అరెస్ట్ చేసి జైలుకు పంపించారని చెప్పారు. అరాచకాలను అడ్డుకున్నందుకే తమ నాయకులపైన అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి, బీజేపీ ఎంపీ అరవింద్ పోలీసులను బూతులు తిట్టినా వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు.
డీజీపీ తమకు ఒక న్యాయం, కాంగ్రెస్, బీజేపీకి ఇంకో న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డీజీపీ శివధర్‌రెడ్డి రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు.. కాకి బుక్ ఉంటుంది అని సినిమా డైలాగులు కొట్టారని, ఇప్పుడు కాకీ బుక్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. రానున్న రెండు సంవత్సరాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని.. కచ్చితంగా మీ అరాచకాలకు తగిన శిక్షను అనుభవిస్తారని హెచ్చరించారు.
ఎలక్షన్ కమిషన్ కూడా ప్రజాస్వామికంగా, రాజ్యాంగబద్ధంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌లో ఎన్నికలు నిజాయతీగా, పారదర్శకతగా నిర్వహించాలని, సీసీ కెమెరాల మధ్య సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు జరగనివ్వాలని కోరారు.
కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు..
కొంతమంది పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారు కాంగ్రెస్ కండువాలు కప్పుకుని పని చేయాలని కేటీఆర్ హెచ్చరించారు. తమ ఎమ్మెల్యే, ఆదివాసీ బిడ్డ కోవ లక్ష్మి పైన కూడా అక్రమంగా కేసు పెట్టారని, ప్రజాస్వామికంగా ప్రజల తీర్పును గౌరవించేలా కాపాడుకోవడమే ఆమె చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
సుమన్‌తో పాటు పార్టీ నాయకుల బెయిల్ కోసం న్యాయ స్థానాలను పార్టీ లీగల్ వింగ్ ప్రయత్నిస్తున్నదని తెలిపారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, సంజయ్ కల్వకుంట్ల, కెపి వివేకానంద గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, గొంగిడి సునీత, జీవన్‌రెడ్డి, నాయకులు జాన్సన్ నాయక్, గెల్లు శ్రీనివాస్, మాజీ చైర్మన్ తుంగబలు సతీశ్, పల్ల ప్రవీణ్ ఉన్నారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న కాంగ్రెస్..
నిర్మల్ (విజయక్రాంతి): అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజా పాలన విస్మరించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నదని కేటీఆర్ అన్నారు. బాల్క సుమన్‌తో ములాఖత్‌కు వెళ్తూ నిర్మల్‌లో మాట్లాడారు. ప్రజలకు ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను వంచించి మోసం చేశారని ధ్వజమెత్తారు.
కష్టకాలంలో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నేతలకు భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఉంటుందని, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అధైర్య పడవద్దని సూచించారు. ప్రజలతో మమేకమై ప్రజల హక్కుల కోసం కలిసి పోట్లాడుదమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రామ్ కిషన్ రెడ్డి, జాన్సన్ నాయక్, లోలం శ్యాం సుందర్, కిరణ్ కారి, మార్గొండ రాము, అయ్యన్న గారి రాజేందర్, భూషణ్ రెడ్డి పాల్గొన్నారు.




