కేరళ ఇక కేరళం
- కేరళ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్
- ఢిల్లీ సేవా తీర్థ్‌లో పీఎం మోదీ అధ్యక్షతన తొలి క్యాబినెట్ సమావేశం
- సర్వికల్ క్యాన్సర్ నివారణకు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీకి ఆమోదం
- స్టార్టప్స్, పట్టణీకరణకూ భారీగా నిధులు
- వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౨౪: కేరళ పేరును ‘కేరళం’గా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. తమ రాష్ట్రం పేరు ‘కేరళం’ అని మార్చాలని ఆ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, కేంద్ర మంత్రి వర్గం ఆ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. అలాగే గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్ ముప్పు తప్పించేందుకు యావత్ దేశానికి చెందిన ౯-౧౪ ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఈ టీకా కార్యక్రమం పాఠశాల యజామాన్యాల భాగస్వామ్యంతో జరుగుతుంది. పాఠశాలకు వెళ్లని బాలికలకు సమీప అంగన్వాడీ కేంద్రాలు లేదా వైద్యారోగ్య కేంద్రాల ద్వారా టీకా అందుతుంది. ‘మిషన్ ఇంద్ర ధనుష్’ తరహాలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం న్యూఢిల్లీలోని సేవా తీర్థ (పీఎంవో)లో తొలిసారి కేంద్ర మంత్రివర్గం భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.
సమావేశానికి సంబంధించిన నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పాజెక్టు ఖర్చులో 25 శాతం కేంద్రం భరిస్తుంది. మిగిలిన 50 శాతం నిధులను మార్కెట్ నుంచి సమీకరించాల్సి ఉంటుంది.
దీనివల్ల నగరాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.10 వేల కోట్లతో ‘స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0’ ఏర్పాటుకూ ఆమోదం తెలిపింది. అలాగే నోయిడా మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
కేరళ ఏర్పడిన నాటి నుంచి డిమాండ్
మలయాళంలో ఆ రాష్ట్రాన్ని కేరళం అని పిలుస్తారు. దేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన నాటి నుంచి కేరళప్రజలు ఈ డిమాండ్‌ను తరచూగా తెరమీదకు తెస్తూనే ఉనానరు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో రాష్ట్రం పేరు ‘కేరళ’ అని ఉండటంతో, దీనిని సవరించాలని రాష్ట్ర అసెంబ్లీ గతంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది.
కేంద్రం ఆమోదంతో రాష్ట్రాల పేరు మార్పు బిల్లు--2026ను రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపనున్నారు. అనంతరం రాష్ట్రపతి సిఫార్సుతో పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెడతారు. రాజ్యాంగంలోని అధికరణ- 3 ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని హోం శాఖ ఈ ప్రతిపాదనను న్యాయశాఖతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంది.




