22-01-2026 12:13:05 AM
రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేశాం
సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నాం
జగిత్యాల జిల్లా ధర్మపురి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హాజరైన మంత్రులు తుమ్మల, అడ్లూరి
ధర్మపురి, జనవరి 21 (విజయక్రాంతి): గత పాలకుల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, దాన్ని సరిచేస్తూ నేడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగా సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా శుద్ధ నీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.
తమ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, వైద్యం, సంక్షేమ రంగాల అభివృద్ధికి సంకల్పబద్ధంగా పని చేస్తోందన్నారు. నాణ్యమైన వసతులు అందాలి అనే భావనతో ఇంటిగ్రెటెడ్ పాఠశాలల కార్యక్రమాలు చేపట్టామ న్నారు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయిం చామనీ, ఒకే ప్రాంగణంలో విద్య, ఆటలు, హాస్టల్, ల్యాబ్స్, డైనింగ్, క్రీడలు అన్నీ ఉండేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అలాగే, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.10 కోట్లు మంజూరు చేశామన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా రూ.17 కోట్లతో ఎన్టీపీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎస్సీ బాలుర వసతిగృహ నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించామని పేర్కొన్నరు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని, రైతులు బలంగా ఉంటే రాష్ట్రం బలంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతు కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందనీ, ఎరువులు, విత్తనాలు, మద్దతు ధర, సాగునీటి సదుపాయాల కల్పన, మార్కెట్ లింకేజీ అన్నీ అంశాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో చూస్తోందన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, కేవలం పథకాలు ప్రకటించడం కాదు, ఆ పథకాలు లక్ష్యానికి చేరేలా కార్యాచరణ రూపొందించడం మా ప్రాధాన్యం అన్నారు.
అనంతరం లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానంలో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ కొట్నాక తిరుపతి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కలెక్టర్ సత్యప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య, దేవస్థాన ఛైర్మన్ జక్కు రవీందర్ పాల్గొన్నారు.