19-11-2025 12:41:18 PM
సత్యసాయి మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం
పుట్టపర్తి: సత్యసాయి గొప్పదనం గురించి విదేశీయులు చెబుతారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో మాట్లాడుతూ, విదేశాల్లో సాయి భక్తులను చాలామందిని చూశానని పేర్కొన్నారు. సత్యసాయి అత్యంత వెనుకబడిన జిల్లాలో వెలిశారని తెలిపారు. సత్యసాయి తన జన్మకు ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారని వివరించారు. సామాన్యుడికి తాగునీరు ఇవ్వాలని సత్యసాయి ఆలోచించారని తెలిపారు. తాగునీటి పథకానికి రూ. 400 కోట్లు సత్యసాయి వెచ్చించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేటి జల్ జీవన్ మిషన్ కు నాటి సత్యసాయి పథకమే అంకురం అన్నారు. సత్యసాయి వేల మంది భక్తులను ప్రభావితం చేస్తారు.. సత్యసాయి మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం అన్నారు. పుట్టపర్తిలో ఘనంగా శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయి కుల్వంత్ హాల్ లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు.