3 August, 2026 | 1:35 PM

నేలకొరిగిన చెట్లు.. వాలిన విద్యుత్ స్తంభాలు

27-05-2024 01:24 AM

హైదరాబాద్, సిటీ బ్యూరో, మే 26 (విజయక్రాంతి):మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్  ఆదివారం గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. వనస్థలిపురం గణేష్ ఆలయం వద్ద చెట్టు విరిగి కారుపై పడి కారు ధ్వంసమైంది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి, తీగలు తెగి ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు కలిగింది. హయత్‌నగర్‌లో అత్యధికంగా 1 సెం.మీ వర్షపాతం నమోదైంది. అలాగే వనస్థలిపురం ఎన్జీవోకాలనీలో 8 మి.మీ, శేరిలింగంపల్లిలో 8 మి.మీ, ఉప్పల్‌లో 6.8 మి.మీ, షేక్‌పేట్‌లో 3.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ప్రభావిత జిల్లాల ఎస్‌ఈలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంతోపాటు తుర్కయాంజాల్, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీల్లో భారీ వృక్షాలు కూలాయి. పెద్దఅంబర్‌పేటలోని జాతీయరహదారిపై ఓ హోటల్ హోర్డింగ్ కూలింది. పసుమాములలో జడ్పీపాఠశాల ప్రహరీపై చెట్టు కూలింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో వృక్షాలు నేలవాలాయి.