డప్పు చప్పుడే.. గుండె చప్పుడైంది!
డప్పు వాద్యం చరిత్ర ఏంటి?
డప్పు అనేది చాలా ప్రాచీనమైనది. మానవుడు కనుగొన్న మొట్టమొదటి వాయిద్యం ఇది. ఆదిమ కాలంలో జంతువులను తరమడానికి ఉపయోగించిన వాయిద్య డప్పు. అడవిలో చనిపోయిన కళేబరం.. బర్రె, దూడ, మేక ఏదైన కావొచ్చు. అవి చనిపోయి.. ఎండకు ఎండి.. వానకు తడుస్తాయి. ఆ క్రమంలోనే వాటి చర్మం వాయిద్యం అవుతుంది. ఆది మానవుడి కాలికి చిన్న రాయి తగిలి.. కళేబరం మీద పడ్డది.
అలా పడిన వెంటనే ‘ఢం’ అనే శబ్దంతో డప్పు అనేది పుట్టింది. మరొకటి జాంబవ పురాణంలో ఆదిశక్తిని అంతమొదించడానికి జాంబవంతుడు కప్పను చీల్చి డప్పును తయారు చేస్తాడు. జాంబవంతుడి కథలో బైండ్ల పురాణంలో డప్పు కనిపిస్తుంది. ఇది దాని పురాతన నేపథ్యం. ఇది మొట్టమొదటి సంగీత వాయిద్యం. సంగీతానికి అమ్మలాంటిది డప్పు. సకల కళలకు సంగీత వాయిద్యం డప్పు. మొట్టమొదటి శబ్ద వాయిద్య కూడా డప్పు.
మీరు ఏ వయసు నుంచి డప్పు వాయించడం నేర్పుకున్నారు?
నేను ఏడేళ్ల వయసు నుంచి డప్పు వాయిస్తున్నాను. మా తాత.. మూత్తాతల నుంచి డప్పు వాయించే సంస్కృతి ఉన్నది. మా ఊరిలో మొత్తం చాటింపు.. మంచి, చెడు, జాతరలు, పెండ్లిళ్లు.. ఇలా ఊర్లో ఏది జరిగిన మా కుటుంబం నుంచే డప్పు వాయించేవారు. అట్ల నేను ఏడేళ్ల వయసులో భుజానికి డప్పును వేసుకున్నాను. మా కుటుంబంలో ఇప్పుడు నాలుగో తరం నడుస్తున్నది. ఈ కళను నేర్చుకోవడం కొంచెం కష్టం. ఇది ఒక కుల కళగా ఉండిపోయింది. అందరు దీన్ని స్వీకరించరు. డప్పు కొడితే.. మాల, మాదిగ సామాజిక వర్గం అనే సంస్కృతి ఉన్నది. అట్ల డప్పు అనేది ఒక కుల కళగా చూస్తున్నది. ప్రస్తుతం మన తెలంగాణ భాష సంస్కృతిక శాఖ సౌజన్యంతో ఇది కులం కాదు కళ అనే ఉద్దేశ్యం తీసుకురాగలిగాం. ఇప్పుడు అన్నీ సామాజిక వర్గాలకు దీన్ని నేర్పిస్తున్నాం.
కొత్తతరం వాళ్లు ఆసక్తి చూపుతున్నారా?
గ్రామీణ నేపథ్యంలో చూసినట్లయితే ఒక కళ మీద.. తెలంగాణ సంస్కృతి మీద కొంచెం సోయి ఉన్న యువతీ, యువకులు ఈ కళ రంగాల వైపు రావడానికి ఇష్టపడుతున్నారు. మిగతా వాళ్లు డీజే సిస్టమ్ వైపు వెళ్తున్నారు. కళల పట్ల అవగాహన లేని వారు దీన్ని స్వీకరించడం లేదు. ఏదో ఒక బ్యాండ్ కొడుతున్నమా.. వస్తున్నామా.. అనుకుంటున్నారు. కాని ఊర్లో నుంచి వచ్చే వారు దీన్ని స్వీకరిస్తున్నారు.
డప్పును ఏ సందర్భాల్లో వాయిస్తారు?
డప్పును మనిషి పుట్టినప్పుడు 21వ రోజప్పుడు కూడా జోలా పాట పాడే సమయంలో డప్పును వాడుతారు. గ్రామ పండుగలు ఎల్లమ్మ, పోలేరమ్మ, మైసమ్మ ఇలా అన్నీ గ్రామ దేవత పండుగల్లో డప్పును తప్పనిసరిగా వాయిస్తారు. కుల,మతాలకు అతీతంగా జరిగే పీర్ల పండుగ రోజు డప్పును రెండు రోజులు వాయిస్తూనే ఉంటారు. ముఖ్యంగా మనిషి చనిపోయినప్పుడు కచ్చితంగా డప్పును వాయిస్తారు. మనిషి పుట్టుక నుంచి చావు వరకు సాగనంపేదే డప్పు.
ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి గుర్తింపు ఉంది?
ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేదు. ఒక్క తెలంగాణ భాష సంస్కృతిక శాఖ నుంచి మాత్రమే సహాయం లభించింది. నాకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం రావడానికి ఈ శాఖనే ప్రధాన కారణం. ఈ శాఖ ద్వారానే కళాకారులకు ప్రోత్సాహం, ఆదరణ, ఆదాయం రావడం జరుగుతుంది. మిగతా ఏ చోట మాకు ఎలాంటి సహాయం అందలేదు.
అందె భాస్కర్ (డప్పు భాస్కర్)గా మీ గురించి?
మాది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామం. చిన్నప్పటి నుంచి డప్పు వాయిస్తున్నాను. ఈ రంగం వైపు రావడానికి కారణం మా నాన్న.. మా నాన్న వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి. ఆయన ప్రోత్సాహం ఎక్కువగా ఉండేది. అట్లాగే అరుణోదయ సంఘం విమలక్క గారి ప్రభావం నా మీద పడ్డది. అలా మొదలైన నా ప్రస్థానం డిగ్రీ చేయడానికి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఒగ్గురవి అన్న పరిచయం అయ్యాడు. అలా ఒగ్గురవన్నా, డాక్టర్ సుద్దిరాజ్ యాదవ్ అన్న, దరువు రమేష్ అన్న ఈ ముగ్గురు నన్ను సాహిత్యం వైపు నడిపించారు. అయితే అప్పటికే నేను పాటలు రాసేది, పాడేది, మ్యూజిక్ కంపోజ్ చేసేవాడిని.
అట్ల వీళ్లు నన్ను ఈ రంగంవైపు మళ్లించారు. అప్పటికే నేను నిజాం కాలేజీలో డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించాను. తర్వాత తెలుగు యూనివర్సిటిలో ఎంఫీల్ చేశాను. తర్వాత ఢిల్లీలో (సీఆర్‌టీ) సెంట్రల్ కల్చరల్ రిసోర్చ్ ట్రెయినింగ్ అనేది ఉండేది. ఇది యువజన కళాకారులను గుర్తించి ప్రత్యేక స్కాలర్ షిప్‌లను అందిస్తున్నది. దాని ద్వారా నాకు స్కాలర్ షిప్ రావడం జరిగింది. అట్ల నా రచనలు అన్ని డప్పుకు రిలేటెడ్‌గా ఉండేవి. కవిత్వంలో, పాటలో డప్పు శబ్దాన్ని వినిపించడం నాకు అలవాటైంది.
తెలుగు యూనివర్సిటీలో కుంపటి సూర్య భగవంతారావు అధ్యపకుడిగా ఉన్నారు. ఆ సర్ నోటితో దరువులను చెప్తు.. అదే శబ్దాలను డప్పు మీద వాయించేది. అలా ఆ సర్ దగ్గర ఓనమాలు నేర్చుకున్నాను. నేను తెలంగాణ కళరూపాల్లో జానపద వాయిద్యాల ప్రాధాన్యత అనే అంశం మీద ఎంఫీల్ చేశాను. తర్వాత ‘డప్పు పుట్టుక చరిత్ర’ మీద పీహెచ్‌డీ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎనిమిది అంతర్జాతీయ ప్రదర్శనలు ఇచ్చాను.
ఇంకో విషయం చేప్పాలి. డప్పు తయారీ అమ్మాయిలు మాత్రమే చేస్తారు. కానీ వాయించే దగ్గర మాత్రం వాళ్లు కనిపించదు. అది నాకు ఎందుకో నాకు బాధ అనిపిస్తది. అందుకే ఇట్లా కాదు అని అమ్మాయిలకు కూడా నేర్పించాలని నేను వర్క్ షాప్ నిర్వహిస్తే దాంట్లో 20 మంది అమ్మాయిలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఒక ఏడాదికి ఇంకో 1500 వందమంది అమ్మాయిలకు నేర్పించాను.
అది కూడా తెలంగాణ సోషల్ వెల్పెర్, ట్రైబల్ వెల్ఫెర్‌లో నేర్పించాను. అట్ల నా శిష్యులను పది క్యాంపుల్లో పెట్టి బుర్ర కథ, డప్పు, జెడకోకు అనే మూడు వాయిద్యాలను నేర్పించాను. దానికి నాకు బెస్ట్ టీచర్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో భాష సంస్కృతిక శాఖను ప్రోత్సాహం ఉండటం వల్ల రిసెంట్‌గా రిపబ్లిక్ పరేడ్‌లో కూడా తెలంగాణ నుంచి మన మహిళా డప్పు బృందం నేతృత్యం వహించింది.
మీరు స్థాపించిన అకాడమీ గురించి చెప్పండి?
నేను స్థాపించిన అకాడమీ పేరు అందె మ్యూజిక్ అకాడమీ. దాంట్లో రిప్లబిక్ పరేడ్ 24మంది నా విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరు అమ్మాయిలే. తెలంగాణ భాష సంస్కృతిక శాఖ సహకారంతో కేంద్ర సంగీత్ నాటక్ అకాడమీ పిలుపు మేరకు మన విద్యార్థులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ 74 ఏళ్ళ స్వాతంత్య్రంలో ఇంత వరకు ఒక డప్పు దరువు అనేది ఢిల్లీ పరేడ్‌లో పాల్గొనలేదు. ఈసారి మనం దాన్ని పల్లె నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాం. రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొన్నాం.
అట్లాగే భారత్ పర్వ్ అనేది దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన కళారూపాలకు సంబంధించి ప్రదర్శనలు ఎర్రకోట మీద జరుగుతాయి. ఈ సంబరాలు ఐదు రోజులు జరుగుతాయి. అట్ల తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిది మనమే. అమ్మాయిలు డప్పులకు దూరంగా ఉంటారో వాళ్ళకు ట్రెయినింగ్ ఇచ్చి మనం ప్రదర్శనలకు తీసుకెళ్తున్నాం. తమ్ముడు అమరావరపు సతీష్ నన్ను స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది అమ్మాయిలకు డప్పు నేర్చించాడు. అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది.






