5 June, 2026 | 1:50 AM

విదేశీయుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి

05-06-2026 01:06 AM
  1. హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు పోలీసుల సూచన
  2. విదేశీ పౌరులు బస చేసిన 24 గంటల్లో ఫారం సమర్పణ తప్పనిసరి
  3. విదేశీ విద్యార్థుల వివరాలకు విద్యాసంస్థలు ఫారం- దాఖలు చేయాలి
  4. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్
  5. విదేశీయుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
  6. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం- ప్రకారం కఠిన నిబంధనలు

శంషాబాద్, జూన్ 4 (విజయక్రాంతి) ఇమ్మిగ్రేషన్ విదేశీయుల చట్టం-2025, ఇమ్మిగ్రేషన్ మరియు విదేశీయుల నియమాలు-2025 ప్రకారం విదేశీ పౌరులకు సంబంధించిన సమాచారాన్ని తప్పని సరిగా సమర్పించాలని శంషాబాద్ జోన్ డీసీపీ  బి. రాజేష్ తెలిపారు. ఇంటి యజమానులు, హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలు, హోమ్స్టేలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఆసుపత్రులు, ఇతర వసతి ప్రదాతలందరూ ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

వసతి కల్పించే వారు తమ ప్రాంగణంలో బస చేసే ప్రతి విదేశీ జాతీయుడి వివరాలను ఫారం-III, ఫారం-C రూపంలో ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. విదేశీ పాస్పోర్ట్ హోల్డర్లు, ఓసీఐ కార్డ్ హోల్డర్లు, నేపాల్ జాతీయులు, అలాగే ఇతర విదేశీ పౌరుల వివరాలు కూడా ఇందులో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. విదేశీయుడు వసతి ప్రాంగణానికి చేరుకున్న 24 గంటల్లోపు నిర్దేశిత ఆన్లైన్ పోర్టల్ ద్వారా వివరాలు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

విద్యాసంస్థలకు ఫారం తప్పనిసరి

విదేశీ విద్యార్థులను చేర్చుకునే విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు ఫారం-II సమర్పించాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థుల ప్రవేశం, నమోదు, రాక, నిష్క్రమణ, చదువు నిలిపివేత, ఇతర నిర్దేశిత వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వర్తించే చోట ఓసీఐ కార్డ్ హోల్డర్లు, నేపాలీ జాతీయులు, ఇతర విదేశీ విద్యార్థుల వివరాలు కూడా సమర్పించాలన్నారు.

రికార్డులు ఏడాది పాటు భద్రపరచాలి

సంబంధిత వసతి ప్రదాతలు విదేశీ పౌరుల నిష్క్రమణ వివరాలను కూడా సమర్పించాలి. అలాగే సమర్పించిన రికార్డులను కనీసం ఒక సంవత్సరం పాటు భద్రపరచాలని డీసీపీ తెలిపారు. వివరాలు దాచిపెట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, లేదా చట్టబద్ధమైన అవసరాలను పాటించకపోవడం శిక్షార్హమైన చర్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ఫారం ఫారం-C సమర్పించడంలో విఫలమైతే అది విదేశీ పౌరుల రిపోర్టింగ్కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని తెలిపారు. అలాగే విద్యాసంస్థలు ఫారం సమర్పించకపోతే విదేశీ విద్యార్థుల రిపోర్టింగ్ నిబంధనల ఉల్లంఘనగా భావించి, ఇమ్మిగ్రేషన్ మరియు విదేశీయుల చట్టం- 2025లోని సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చట్టపరమైన పరిణామాలను నివారించడానికి హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్హౌస్లు, హోమ్స్టేలు, విద్యాసంస్థలు, ఇతర వసతి కల్పించే సంస్థలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని శంషాబాద్ జోన్ డీసీపీ బి. రాజేష్ సూచించారు.