calender_icon.png 12 November, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి..

12-11-2025 06:15:03 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి మండలం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేసే ప్రక్రియ వారాంతం లోపు పూర్తిచేయించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలతో పీఎంఏవై, ఇందిరమ్మ ఇల్లు, రెండు పడకల ఇళ్లు, ఉపాధి హామీ పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేసే ప్రక్రియ వనపర్తి జిల్లాలో చాలా మందకొడిగా సాగుతుందని అందులో చిన్నంబావి మండలం చాలా వెనకబడి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ అప్లోడ్ చేసే ప్రక్రియను వేగవంతం చేసి ఈ వారాంతం లోపు పూర్తి చేయించాలని ఎంపీడీఓ లను ఆదేశించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఇంకా గ్రౌండింగ్ కానీ వాటిపై దృష్టి పెట్టీ వెంటనే గ్రౌండింగ్ చేయడమా లేదా రద్దు చేయడమో చేయాలని ఆదేశించారు. 

డబ్బుల ఇబ్బందుల వల్ల నిర్మాణం ప్రారంభించని వారికి మహిళా సంఘాలు, బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పించాలని సూచించారు. వెంటనే గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి గ్రౌండింగ్ చేయని వారితో మాట్లాడి నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చూడాలన్నారు. ఇప్పటి వరకు గ్రౌండింగ్ అయిన ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధి హామీ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి ఉన్న రెండు పడకల ఇళ్లు 524 ఎవరికి కేటాయించకుండా ఉన్నాయని, వాటిని త్రిసభ్య కమిటీ, ఇందిరమ్మ కమిటీ సమన్వయంతో పనిచేసి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల్లో ఎల్ 1, ఎల్ 2 జాబితా నుండి అర్హులైన వారిని గుర్తించి రెండు పడకల ఇళ్లు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

ఉపాధి హామీ పథకం కింద విద్యాలయాలకు మరుగుదొడ్లు, కిచెన్ షెడ్, ప్రహరీ గోడ మంజూరు చేసేందుకు అవకాశం ఉందని, అందువల్ల అన్ని విద్యాలయాలను పరిశీలించి ఏ పాఠశాలకు మరుగుదొడ్లు అవసరం ఉన్నాయి, కిచెన్ షెడ్, ప్రహరీ ఎవరికి అవసరం ఉందో పూర్తి నివేదికను శుక్రవారం లోగా నిర్ణిత ప్రొఫార్మాలో అందజేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కింద  పనుల రోజుల సంఖ్య పెంచాలని, పనులు మంజూరు చేసినా లేబర్ తో పనులు చేయించకపోవడం సరికాదని చెప్పారు. అదేవిధంగా ఉపాధిహామీ కూలీల ఇకెవైసి ప్రక్రియ వంద శాతం పూర్తి.చేయించాలని సూచించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య పిడి డి ఆర్డిఓ ఉమాదేవి, ఈ.ఈ పంచాయతీ రాజ్ మల్లయ్య, పి.డి. హౌసింగ్ విటోభ, డిపిఓ తరుణ్ చక్రవర్తి, డిప్యూటీ సీఈవో రామమహేశ్వర రావు, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.