04-05-2025 12:58:36 AM
మహబూబాబాద్/హనుమకొండ, మే 3 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా దేవన్నపేటలోని దేవాదుల ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్లలో పూర్తిచేసి సాగునీటి ఇబ్బం దులు లేకుండా చేస్తామని, ఇందుకోసం బడ్జెట్‌లో రూ.23 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.
అదనంగా రెండేళ్లలో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి చర్యలు తీకుంటున్నామని వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడానికి అవసరమైన ఆరవ ప్యాకేజీ పనులను వేగంగా పూర్తి చేయాలని, ధర్మసాగర్ నుంచి ఘనపూర్ రిజర్వాయర్‌కు నిరంతరం రెండు పంపులు పూర్తిస్థాయిలో నడిపితే తప్ప స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, జనగామ నియోజకవర్గాల పరిధిలోని రైతులకు సాగునీరు అందించగ లుగుతామన్నారు.
శనివారం దేవాదుల పంప్‌హౌస్‌ను మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా శాఖలో ఉన్నతాధికారులతో హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో శని వారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై శీతకన్ను పెట్టిందని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పలు మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తికాకుండా మధ్యలో నిలిచిపోయాయన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని భూతద్దంలో చూపి, మిగిలి న ప్రాజెక్టులను మూలకు పడేశారని విమర్శించారు.
సన్న బియ్యం పంపిణీ దేశానికే రోల్ మాడల్: పొంగులేటి
రాష్ట్రంలోని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా రూ.ఐదు లక్షల వ్యయంతో ఇండ్లు నిర్మించి ఇవ్వడం, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం, కుల గణన చేపట్టడంతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మాడల్‌గా నిలుస్తోందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో కాలయాపన చేసిందన్నారు.
సం క్షేమ పథకాలన్నీ పూర్తిగా నిరుపేదలకు, అర్హులకు మాత్రమే దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మాడల్‌గా నిలుస్తుందని చెప్పారు.
ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి కృషి: సీతక్క
ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, విద్యుత్, రవాణా, ఇతర సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, డాక్టర్ భూక్య మురళినాయక్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, కలెక్టర్లు ప్రావీణ్య, అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.