04-05-2025 12:55:56 AM
మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లకు మెడికల్ టూరిజంపై పరిచయ కార్యక్రమం
మెడికల్ టూరిజంను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ
ఉగ్రదాడి నేపథ్యంలో పటిష్ట భద్రత
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): వైద్య సదుపాయాలు, చికిత్సలు, అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవం కలిగిన వైద్యులు, అం తర్జాతీయ స్థాయి ఆసుపత్రులతో రోగులకు చికిత్సను అందిస్తూ తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్ ప్రపంచంలోనే ప్రసిద్ది చెందింది.
రానున్న కొద్ది రోజుల్లో జరుగబోయే మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచంలోనే తెలంగాణ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానున్నది. ఈ సందర్భంగా మెడికల్ టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం రేవంత్ మార్గదర్శనం చేశారు. 120 దేశాల ప్రతినిధులు హాజరుకానున్న కార్యక్రమాన్ని 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఈ క్రమంలో ప్రత్యేకంగా మెడికల్ టూరిజంను ప్రమోట్ చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సీఎం రేవంత్ సూచనతో తెలంగాణ లో తక్కువ ఖర్చుతో అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలను, మెడికల్ టూరిజంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని తెలిపేలా మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లకు ఈ నెల 16న హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో మెడికల్ టూరిజం ఈవెంట్‌ను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.
తక్కువ ఖర్చుతోనే చికిత్సలు
అమెరికా, యూరప్ వంటి దేశాలతో పోలి స్తే తెలంగాణలో చికిత్స ఖర్చులు 60 శాతం నుంచి 80 శాతం వరకు తక్కువగా ఉంటాయి. శతాబ్ద కాలంగా వైద్యరంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ పేద ప్రజలకు అందుబాటు లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్, గాంధీ ఆసుపత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సహా అనేక ప్రైవేటు అత్యాధునిక సాంకేతికతతో రోగులకు వైద్యం చేస్తున్నాయి.
రోబోటిక్ సర్జరీ, టెలిమెడిసిన్ వంటి చికిత్సలు, మల్టీ స్పెషాలిటీ కేంద్రాలతో, కార్డీయాలజీ, ఆర్ధోపెడిక్స్, క్యాన్సర్ చికిత్స, ట్రాన్స్‌ప్లాంటేషన్స్, కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ, ఫెర్టిలిటీ చికిత్సలు (ఐవీఎఫ్), అవయవ మార్పిడి వంటి సంక్లిష్ట ప్రక్రియలకు నిపుణులైన డాక్టర్లతో సమర్ధవంతమైన చికిత్స అందిస్తున్నారు. మెడికల్ ఖర్చు ల విషయంలో అమెరికా సహా ఇతర పాశ్చా త్య దేశాల్లో ఎక్కువ ఖర్చు అవుతోంది. అం దుకే విదేశాల నుంచి వైద్య అవసరాలకు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు రోగులు వస్తుంటారు.
హైదరాబాద్‌లో అనేక ఆసుపత్రులు జేసీఐ (జాయింట్ కమీషన్ ఇంటర్నేషనల్), ఎన్‌ఏబీహెచ్ అక్రిడేషన్లు సాధించాయి. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్సలు, అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు, ప్రభుత్వ మద్దతు, వైద్య వీసా (ఈ వీసా), సేహాపూర్వక వాతావరణం లాంటి సౌలభ్యాలు విదేశీ టూరిస్టులను బాగా ఆకర్షిస్తున్నాయి. మెడికల్ టూరిజంలో తెలంగాణ ఇప్పటికే దేశంలోనే అగ్రగామిగా ఉంది. మిస్ వరల్డ్ ఈవెంట్ ద్వారా మెడికల్ టూరిజంలో తెలంగాణను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఉపకరిస్తుందని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది.
హైదరాబాద్‌లో హై అలర్ట్
పహల్గాం ఉగ్రదాడి నేపద్యంలో మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తోంది. ఉగ్ర దాడులకు అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. 120 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నందున భద్రతా ఏర్పాట్లు మరింత పెం చారు.
ఈనెల 12న పాతబస్తీలోని లాడ్‌బజార్, చార్మినార్, మోతీగల్లీలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హేరిటేజ్ వాక్ చేసే కార్యక్రమం ఉంది. దీంతో ఒకరోజు ముందే సాయుధ బలగాలు సంబంధిత ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. చౌమహల్ల ప్యాలెస్‌లో సాం స్కృతిక కార్యక్రమాలు ఉండడంతో తనిఖీలను పకడ్భందీగా చేయనున్నారు.
ఈ నెల 14న రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అక్కడా భారీ భద్రతను ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ వరంగల్ పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అనంతరం యాదగిరిగుట్ట, పోచంపల్లి, బుద్ధవనం సందర్శన ఉండడంతో హైదరాబాద్ సహా మూడు కమీషనరేట్ల పరిధిలో భద్రతను మూడింతలు పెంచారు.