23 May, 2026 | 7:47 PM

అభివృద్ధి ప్రగతిబాట పట్టేనా!

18-06-2024 12:32 AM
  • రెండు నెలలుగా నిలిచిన పనులు
  • ఎన్నికల కోడ్ ముగియడంతో పథకాలపై ఆశలు

మెదక్, జూన్ 1౭(విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచాయి. గత మార్చి 16వ తేదీన నోటిఫికేషన్ రాగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి అధికారులు, ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలోనే బిజీగా మారారు. దీంతో రెగ్యులర్‌గా జరగాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచాయి. కలెక్టరేట్ నుంచి గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజల సమస్యలు పేరుకుపోయాయి. ఓట్ల లెక్కింపు, ప్రమాణ స్వీకారాలు కూడా ముగిసి కోడ్‌కు తెరపడింది.  దీంతో జిల్లాలో రెండు నెలలుగా నిలిచిన పరిపాలన వ్యవహారాలు తిరిగి యధావిధిగా ప్రారంభమయ్యాయి. అభివృద్ధి పనులు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో జిల్లా ప్రగతి తిరిగి  పట్టాలెక్కనుంది. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కూడా సోమవారం నుంచి ప్రారంభమైంది.

అభివృద్ధి పనులకు లైన్‌క్లియర్

కొత్తగా మంజూరైన వివిధ రకాల పనుల ప్రారంభోత్సవానికి ఇన్నాళ్లు ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీలలోనూ పలు నిర్మాణాలు నిలిచాయి. తాజాగా కోడ్ ఎత్తివేతతో ఇలాంటి పనులకు లైన్ క్లియర్ అయింది. పనులు ప్రారంభించి కొనసాగించే వెసలుబాటు కలిగింది. ఇదివరకు చేపట్టిన పనులకు సంబంధించి రూ.కోట్లాది బిల్లులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వాటి చెల్లింపుతో పాటు కొత్త పనులకు ప్రతిపాదనలు అందాల్సి ఉంది. 

ప్రారంభమైన ప్రజావాణి

జిల్లాలోని ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రతీ  సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి ఎన్నికల కోడ్ కారణంగా నిలిచింది. కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులంతా అందుబాటులో ఉండే ఈ కార్యక్రమం ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో సోమవారం నుంచి తిరిగి పునఃప్రారంభమయింది. దీంతో జిల్లా ప్రజానీకం ఎప్పటిలాగే వచ్చి తమ సమస్యలు అధికారులకు తెలిపి పరిష్కరించుకునే వీలు కలిగింది. 

రేషన్ కార్డులపై భరోసా

ఎన్నికల ప్రక్రియ అనంతరం అర్హులైన వారికి రేషన్‌కార్డులు జారీ చేస్తామని, ఈ ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో అర్హుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాలో వేలాదిమంది నిరుపేదలు కార్డల్లేక ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కార్డుల జారీ ప్రక్రి య ప్రారంభం కానుండడంతో అర్హులందరికీ లబ్ది చేకూరే అవకాశుం ఉంది. వీటితో పాటు వానాకాలం రానున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై సమీక్షలు నిర్వహించే అవకాశముంది. త్వరలోనే బడులు పునఃప్రారంభం కానున్న నేపథ్యం లో విద్యార్థులకు అవసరమైన యూనిఫాం లు, నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు అందించడంపై అధికారులు దృష్టి సారించనున్నారు. 

ఆరు గ్యారంటీలకు భరోసా కలిగేనా ?

ఆరు గ్యారంటీల్లో భాగంగా 200లోపు యూనిట్లు వినియోగించుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందిస్తోంది. రూ.500కు సిలిండర్ లాంటి పథకాలనూ అమలు చేస్తోంది. దీనికింద వేలాది మంది లబ్ధి పొందారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా కొత్తగా మంజూరు నిలిపివేశారు. దీంతో చాలామంది అర్హులు ప్రయోజనాలు పొందలేకపోయా రు. అలాంటివారు ఎంపీడీవో, మున్సి పల్ కార్యాలయల్లో సంప్రదించారు. తమ వివరాలు అందజేయాలని సూచించారు. తాజాగా వారి వివరాలు పరిశీలించి లబ్ది చేకూర్చనున్నారు. దీంతో ఆయా పథకాల లబ్దిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.