కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు
ఉపాధి హామీ నిధులతో నిర్మించిన వంతెనను ప్రారంభించిన ఎంపీ నగేష్
ఆదిలాబాద్, మే 20 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఉపాధి హామీ నిధులు రూ. 30 లక్షలతో గ్రామంలోని వాగుపై నిర్మించిన వంతెనను స్థానిక నాయకులతో కలిసి ఎంపీ ప్రారంభించారు.
అనంతరం ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ... జిల్లాలో ఉపాధి హామీ నిధులతో సుమారు రూ. 250 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, వంతెనాలు, పొలం బాటలో కల్వర్టులను నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన్యత ఇస్తుందన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులకు కేంద్రం నిధులే ప్రదాన ఆధారమని వెల్లడించారు. రైతులు తమ పంట పొలాలకు వేళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నరని తమ దృష్టికి తీసుకురావడంతో ఈవంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. దీంతో రైతులు తమ పంట పొలాలకు వేళ్లేందుకు సౌకర్యం కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోరండ్ల సంతోష్, ఉప సర్పంచ్ శ్రీరాం, నాయకులు చంద్రకాంత్, జక్కుల ప్రభాకర్, బోండ్ల వెంకట స్వామి, దాతాజీ, కిరణ్, శ్రీనివాస్, మహేందర్ యాదవ్, స్వామి, భూజంగ్ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






