8 August, 2026 | 1:15 AM

హుస్నాబాద్‌కు రూ.33.70 కోట్ల అభివృద్ధి పనులు

08-08-2026 12:00 AM

చేనేత, హరితహారానికి మంత్రి పొన్నం పిలుపు

హుస్నాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామీణ రహదారులు, వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33.70 కోట్లతో 28 అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందులో సిద్ధిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో 15 పనులకు రూ.15 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సంబంధిత శాఖ మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ మార్కండేయ ఆలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ చేనేత వస్త్రాల వినియోగానికి ప్రతిజ్ఞ చేయించి, ఇటీవల మృతి చెందిన చేనేత కార్మికుడు అల్వాల రాములు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు.అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన మంత్రి, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ను హరితాభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని, డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల విస్తరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.