calender_icon.png 1 February, 2026 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులకు అన్నీ కష్టాలే!

01-02-2026 02:49:07 AM

  1. అడుగడుగునా ట్రాఫిక్ జాం
  2. హనుమకొండ నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం 12 గంటలు 
  3. తాత్కాలిక బస్టాండ్‌లో పడిగాపులు 
  4. తాగునీటి వసతి కరువు
  5. మరుగుదొడ్లు, స్నాన ఘట్టాల్లోనూ నీటి కొరత

మేడారం, జనవరి 31 (విజయక్రాంతి): మేడారం మహా జాతరలో ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మహా జాతరకు ప్రపంచ ఖ్యాతి తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం 251 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

అయితే అందుకు భిన్నంగా భక్తులు తమకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోలేదని, హనుమకొండ నుంచి మేడారం ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి 12 గంటలకు పైగా సమయం పట్టిందని, ప్రైవేటు వాహనాల్లో వెళ్లే వారికి పోలీసులు చుక్కలు చూపించారనే విమర్శలు అనేకం వినపడ్డాయి. భక్తులు విడిది చేసే ప్రాంతాలైన కన్నెపల్లి, ఊరట్టం, రెడ్డిగూడెం, చిలకలగుట్ట, గోనేపల్లి, వెంగళాపూర్, కొత్తుర్, కొంగలమడుగు ప్రాంతాల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు, నీటి వసతి కల్పించలేదని విమర్శలు వెల్లువెత్తాయి.

గతంలో ఉన్న రోడ్లనే కాస్త మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారని, ఫలితంగా ఈసారి కూడా జాతరలో వాహనాల రద్దీ కనుగుణంగా రోడ్లు విస్తరించకపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని భక్తులు విమర్శిస్తున్నారు. కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేశామని, భక్తులకు ఈసారి ఇలాంటి ఇబ్బందులు కలగాలని ప్రభుత్వం ప్రకటిస్తే ఎంతో సంతోషించామని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత గతం కంటే ఈసారి ట్రాఫిక్‌కు సమస్య తీవ్ర తీవ్రత అధికంగా ఉందని భక్తులు విమర్శించారు. 

వాహనాల దారి మళ్లింపుతో ఇబ్బందులు

ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ వాహనాలకు పసర నుంచి తాడువాయి మీదుగా మేడారం వెళ్లడం, ఇదే మార్గంలో తిరుగు ప్రయాణం గతంలో జరిగేది. ఈసారి తాడ్వాయి. మధ్యలో ట్రాఫిక్ సమస్య తలెత్తి ఆర్టీసీ బస్సులను, వీఐపీ, వీవీఐపీల వాహనాలను తిరుగు ప్రయాణంలో మేడారం కొంగలమడుగు, చింతల్, పసర మీదుగా భూపాలపట్నం జాతీయ రహదారి మీదుగా మళ్లించారు.

ఇక ప్రైవేటు వాహనాలను పూర్తిగా మేడారం నుంచి నార్లాపూర్ బయ్యక్కపేట్, భూపాలపల్లి మీదుగా మళ్లించారు. దీంతో భక్తులు మేడారం నుంచి గమ్యస్థానాలను దూర భారం అయ్యింది. మేడారం జాతరకు పక్కనే ఉన్న పసర, గోవిందరావుపేట, చల్వయి, ములుగు తదితర ప్రాంతాల భక్తులు భూపాలపల్లి మీదుగా తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడింది. 

ఆర్టీసీ బస్సుల్లో నరకం

మేడారం జాతరలో ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చిన ప్రయాణికులు తిరుగు ముఖం పట్టేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. తాడ్వాయి పసరా మధ్య రెండు రోజులపాటు తరచుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సులువుగా ఆర్టీసీ బస్సుల్లో మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకుని వెళ్లే అవకాశం ఉందని వచ్చిన భక్తులు గం టల తరబడి బస్సుల్లోనే నిరీక్షించా ల్సిన పరిస్థితి నెలకొంది.

మేడారం జాతరకు రోడ్డు, రవాణా కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించలేదని, దీనివల్ల తరచుగా ట్రాఫిక్ అంతరాయం కలిగిందని భక్తులు విమర్శించారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఈసారి జాతరను మహా అద్భుతంగా తీర్చిదిద్దామని ప్రకటించిన ప్రభుత్వం 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అందుకు తగ్గట్టుగా మెరుగైన రవాణా వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

రూ.వందకు నీటి క్యాన్

తాగునీటి ఇబ్బంది తీవ్రతరంగా మారడంతో భక్తులు వంద రూపాయలకు ఒక్క క్యాన్ వాటర్ కొనుక్కొని తాగాల్సి వచ్చింది. మాస్టర్ ప్లాన్ అంటే ఇదేనా అంటూ భక్తులు పలుచోట్ల తమ ఇబ్బందులను ఎత్తిచూపి ప్రభుత్వ తీరును విమర్శించారు. ప్రచారం ఎంతో ఘనంగా నిర్వహించారని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం గద్దెల ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్ది, భక్తుల సౌకర్యాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. మేడారం జాతరలో భక్తులకు కావలసిన సౌకర్యాలను, వసతులను కల్పించకుండా హంగు ఆర్భాటానికే ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.

మాస్టర్ ప్లాన్ ఫలితం ఏమైంది?

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను ఈసారి అద్భుతంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే భక్తులకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం, తాగునీటీ వసతి, మరుగు దొడ్లు, స్నాన ఘట్టాలు, దైనందిన అవసరాలకు నీటి వసతి, పాలు చోట్ల విద్యుత్ దీపాలను ఏర్పా టు చేయలేదనే విమర్శలు వెళ్లువెత్తా యి. ఆర్టీసీ బస్టాండ్  నుంచి రెడ్డిగూ డెం వెళ్లే మార్గంలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయలేదు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డు పూర్తి చేయకుండా కంకరతో వదిలివేయడం వల్ల రాకపోకలకు ప్రయాణికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.