31 May, 2026 | 12:57 AM

కాళేశ్వర క్షేత్రంలో భక్తి పరవశం

31-05-2026 12:18 AM
  1. సరస్వతి అంత్య పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
  2. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల వెల్లువ

కాళేశ్వరం/మహబూబాబాద్, మే 30 (విజయక్రాంతి): త్రివేణి సంగమం భక్తి తరంగాలతో పరవళ్లు తొక్కింది. సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా పదో రోజు కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు, తర్పణాలతో అపూర్వ ఆధ్యాత్మిక వైభవంతో సంగమ క్షేత్రం కళకళలాడింది. పుష్కరాల ముగింపు రోజులు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

సరస్వతి, గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రాంతమైన త్రివేణి సంగమం పుష్కర స్నానాలకు విశేష ప్రాధాన్యత కలిగి ఉండటంతో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. పుణ్యస్నానం అనంతరం పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు నిర్వహించి పితృరుణ విముక్తి కోసం ప్రార్థనలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, జపాలు నిర్వహించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా పెరిగింది.

స్వామివారి దర్శనం కోసం భారీ క్యూలైన్లు ఏర్పడినా, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పించారు.ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగగా, భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు.పుష్కర ఘాట్ల వద్ద జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.

పోలీసులు, రెవెన్యూ, వైద్య, మున్సిపల్, అగ్నిమాపక శాఖల సిబ్బంది సమన్వ యంతో విధులు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సంఘాలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి సేవాభావాన్ని చాటుకున్నారు. పుష్క ర ఘాట్ల పరిసరాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  

పుష్కర స్నానం ఆచరించిన స్వామీజీ 

కర్ణాటకకు చెందిన భీమనకట్టె మఠం పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థ స్వామీజీ త్రివేణి సంగమంలో పుష్కర స్నానమాచరించి, సంకల్ప పూజలు చేశారు. అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు.