హెచ్‌జే దొర అంత్యక్రియలు పూర్తి
మాజీ డీజీపీకి నివాళులర్పించిన డీజీపీ శివధర్‌రెడ్డి
దొర పాడె మోసిన డీజీపీ, సీసీలు
హాజరైన మాజీ డీజీపీలు, ఐపీఎస్ అధికారులు తదితరులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 14 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర అంతిమయాత్ర శనివారం అత్యంత భావోద్వేగపూరిత వాతావరణంలో ముగిసింది. తన మార్గదర్శికి, తన వృత్తి జీవితంలో తొలి అడుగులకు బాసటగా నిలిచిన మహోన్నత వ్యక్తికి అం తిమ గౌరవం సమర్పించే క్రమంలో డీజీపీ బి. శివధర్ రెడ్డి స్వయంగా పాడే మోశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు సాగిన ఈ అంతిమయాత్రలో యావత్ పోలీస్ యంత్రాంగం కన్నీటి వీడ్కోలు పలికింది.
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో, గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించిన అనంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహిం చారు. శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని దొర స్వగృహం వద్ద ఆయన పార్థివ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి నివాళు లర్పించిన అనంతరం, అంతిమయాత్ర ప్రా రంభమైనప్పుడు స్వయంగా పాడే మోసి అందరినీ కదిలించారు. ఆయనతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ కూడా పాడే మోసి దొర పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
అశ్రునయనాల మధ్య మహాప్రస్థానం
మహాప్రస్థానం వద్ద దొర పార్థివ దేహం పై పూలమాలలు వేసి పలువురు ఐపీఎస్ అధికారులు అంజలి ఘటించారు. మాజీ డీజీపీ జితేందర్, సీనియర్ అధికారులు రాజీవ్ త్రివేది, ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐఎస్ డబ్ల్యు ఓఎస్డీ కమలాసన్ రెడ్డి తదితరులు పాల్గొని ఒక శకాన్ని ముగించిన పోలీస్ దిగ్గజానికి వీడ్కోలు పలికారు. పోలీస్ వ్యవస్థలో దొర ప్రవేశపెట్టిన సంస్కరణలు, నక్సలిజం అణచివేతలో ఆయన చూపిన ధైర్యం నేటికీ యువ అధికారులకు స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు.
అధికారిక లాంఛనాలతో వీడ్కోలు..
మహాప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం తరపున అధికారులు సకల మర్యాదలు నిర్వహించారు. సాయుధ దళాల గౌరవ వందనం మధ్య దొర చితికి ఆయన కుటుం బ సభ్యులు నిప్పు పెట్టారు. అంతిమయాత్రలో అసంఖ్యాకమైన పోలీస్ సిబ్బంది, రిటై ర్డ్ అధికారులు, అభిమానులు పాల్గొని జో హార్ హెచ్.జే. దొర అంటూ నినదించారు. ఆయన మృతి కేవలం పోలీస్ శాఖకే కాకుండా, యావత్ రాష్ట్రానికి తీరని లోటని పలువురు వక్తలు నివాళులర్పించారు.




