25 July, 2026 | 9:10 PM

గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై డీజీపీ వీడియో కాన్ఫరెన్స్

25-07-2026 08:33 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): రాబోయే గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్, ఐపీఎస్ గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతంపై సమగ్రంగా సమీక్షించారు.

ముఖ్యంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెంజల్, మెండోరా, ఏర్గట్ల పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉన్న పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు. భక్తుల భద్రత కోసం తాత్కాలిక పోలీస్ అవుట్‌పోస్టుల ఏర్పాటు, ఆధునిక సౌకర్యాలతో కమాండ్ అండ్ కంట్రోల్ హాల్ నిర్మాణం, సీసీటీవీ కెమెరాల విస్తరణ, డ్రోన్ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బ్యారికేడింగ్, పార్కింగ్ ప్రణాళిక, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, మహిళలు, చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాల ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.