జలసిరి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
– ఎంపీడీవో నాగేశ్వర్ గుప్తా
రామారెడ్డి, జూలై 25 (విజయక్రాంతి): రామారెడ్డి రైతు వేదికలో జలసిరి కార్యక్రమం అమలుపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జల సంరక్షణ పనులను గ్రామస్థాయిలో వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతంగా అమలు చేయాలని అధికారులు సూచించారు. ఎంపీడీవో నాగేశ్వర్ గుప్తా మాట్లాడుతూ, జలసిరి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
సమావేశంలో ప్రతి గ్రామపంచాయతీలో ఫామ్ పాండ్లు నిర్మించేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించి సోమవారం నుంచి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే బోర్‌వెల్ రీఛార్జ్, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ప్రాంగణాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం, ఊట కుంటల తవ్వకం వంటి పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో నాగేశ్వర్ గుప్తా, మండల వ్యవసాయ అధికారి భానుశ్రీ, ఏపీఓ ధర్మారెడ్డి, ఏఈఓలు, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.






