ధనుష్ నాకు మంచి మిత్రుడు
‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ వివా దం ఇంకా సమసిపోలేదు. తాజాగా ఈ వ్యవహారంపై నటి నయనతార స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో నయనతారను ‘ధనుష్ గురించి లేఖ రిలీజ్ చేసేంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది?’ అని విలేకరి ప్రశ్నించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. తప్పు చేస్తే భయపడాలని.. న్యాయమని నమ్మినదాన్ని బయటపెట్టేందుకు తానెందుకు భయపడాలని ప్రశ్నించారు.
“పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే మనిషిని కాదు. నా డాక్యుమెంటరీ ఫిల్మ్ పబ్లిసిటీ కోసమే మేము ఇదంతా చేశామని అనుకుంటున్నారు కానీ అదంతా అబద్ధం. వీడియో క్లిప్స్‌కు సంబంధించిన ఎన్‌వోసీ కోసం ధనుష్‌ను సంప్రదించడానికి ఎంతో ప్రయత్నించాం. నేను, విఘ్నేశ్‌తో పాటు మా కామన్ ఫ్రెండ్స్ ద్వారా కూడా కాల్స్ చేయించాం.
కానీ ఎన్‌ఓసీ ఇవ్వలేదు. సినిమాలో ఉపయోగించిన నాలుగు లైన్ల డైలాగ్‌లోని ఆ మాటలు మా జీవితానికి ఎంతో ముఖ్యం. అందుకే వినియోగించాం. ముందు నుంచీ ధనుష్ నాకు శత్రువేమీ కాదు.. మంచి మిత్రుడు. అందుకే అసలు ఆయనకు నాపై ఎందుకు కోపం వచ్చిందో తెలుసుకోవాలని ఆయనతో మాట్లాడేందుకు ఎంతో ప్రయత్నించా” అని నయనతార తెలిపారు.
హైకోర్టు నోటీసులు..
నయనతార జీవితాధారంగా రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో తన పర్మిషన్ తీసుకోకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజ్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్ లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నయనతార ధనుష్ క్యారెక్టర్‌ను తప్పు బడుతూ బహిరంగ లేఖ రాశారు.
ఆ తరువాత ఆ సన్నివేశాలు డాక్యుమెంటరీ నుంచి తొలగించకపోవ డంపై ధనుష్ ఆగ్రహంతో నయనతార దంపతులపై కోర్టులో దావా వేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. జనవరి 8వ తేదీ లోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని నయన్ దంపతులతోపాటు నెట్‌ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశిస్తూ వారికి నోటీసులు జారీ చేసింది.






