17 August, 2026 | 3:05 PM

కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర..

17-08-2026 02:30 PM

తుంగతుర్తిలో మహిళలతో కలిసి బిఆర్ఎస్ నాయకుల ధర్నా..

తుంగతుర్తి (విజయక్రాంతి): పేదింటి ఆడబిడ్డలకు ఆత్మగౌరవంతో కూడిన వివాహాన్ని అందించేందుకు నాటి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ సారథి కెసిఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు.

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సూచనలతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని మహిళా నాయకులతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మండల పార్టీ మాజీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ...పేద కుటుంబాలకు అండగా నిలిచిన పథకాలను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదని, తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 అక్టోబర్ 2న ఈ పథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. తొలుత రూ.51 వేల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచినట్లు తెలిపారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు.

కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించిందని అన్నారు. అయితే ఎన్నికల సమయంలో కల్యాణ లక్ష్మితో పాటు పేద ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు, చేయడం లేదని విమర్శించారు.

కల్యాణలక్ష్మి కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఆడబిడ్డకు, ఎన్నికల హామీ మేరకు తులం బంగారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆడబిడ్డకు పథకం అమలు జరిగేలా, ఒత్తిడి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ ధర్నాలో మహిళలు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.