9 May, 2026 | 5:18 AM

ధీమా రెతు.. దిగాలు

25-04-2024 02:54 AM

నాలుగు నెలల్లోనే అన్నదాతలకు నరకం l కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ వైఫల్యం

కష్టపడి నీళ్లు తెస్తే కేఆర్‌ఎంబీకి ఇచ్చివచ్చారు

l రైతుల కోసం భూమ్యాకాశాలను ఏకం చేస్త

నాడు రెప్పపాటు పోని కరెంటు ఇప్పుడేమైంది?

l  కేసీఆర్ పక్కకు పోగానే కట్క ఏసినట్టే మాయమైంది

మిర్యాలగూడ, సూర్యాపేట సభల్లో మాజీ సీఎం కేసీఆర్

l మిర్యాలగూడ నుంచి బస్సుయాత్ర ప్రారంభం

నల్లగొండ, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పాలనలో ధీమా గా ఉన్న రైతు.. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో దిగాలు పడిపోయాడని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రెప్పపాటు కూడా పోని కరెంటు.. కాంగ్రెస్ పాలనలో కట్క బంద్‌చేసినట్టు మాయమైపోయిందని విమర్శించా రు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి బుధవారం ఆయన పోరుయాత్ర పేరుతో బస్సుయాత్ర ప్రారంభించారు. మొదటిరోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో యాత్ర కొనసాగింది. యాత్ర ప్రారం భం సందర్భంగా మిర్యాలగూడలో కేసీఆర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ పోరాటం చేసి నీళ్లు, నిధులు, కరెంటు కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొంటే.. ప్రస్తుతం నల్లగొండ జిల్లాకే చెందిన దద్దమ్మ నీళ్ల మంత్రి పోయి నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి  అప్పగించి వచ్చారని ఆరోపించారు. 

కరెంటు ఎక్కడ పోయింది?

బీఆర్‌ఎస్ పాలనలో ఎన్నడూ పోని కరెంటు ఇప్పుడు ఎక్కడ పోయిందని కేసీఆర్ ప్రశ్నించారు. ‘రైతులు కష్టపడాల్సిన అవసరం లేకుండా 9 ఏళ్లపాటు విద్యుత్తు వ్యవస్థను, సాగునీరు, తాగునీటి వ్యవస్థలను బలోపేతం చేసి, కష్టపడి మిగులు కరెంటు ఉండేలా తీర్చిదిద్దిన. గతంలో మెరుగైన విద్యుత్తు ఇచ్చినట్టు ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నడపలేకపోతున్నది. కేసీఆర్ పక్కకు జరగ్గానే కట్క బంద్ చేసినట్లే కరెంటు బందయ్యింది. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నారు. రైతుల చెప్పులు కూడా గట్టిగా ఉంటాయి’ అని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్తు, మిషన్ భగీరథ వ్యవస్థలను బలోపేతం చేస్తే కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వ వాటిని సమర్థంగా నిర్వహించలేక ప్రజలను తీవ్ర బాధ పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

నల్లగొండ జిల్లా మంత్రులు కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకొన్నారని మండిపడ్డారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నిరుద్యోగ భృతి ఇస్తామంటే.. నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆ మాటే అనలేదని అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అలివికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారని, అది సాధ్యమయ్యే పనేనా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో హిమాలయ పర్వతం ఎత్తున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేస్తే కాంగ్రెస్ నేతలు కనీసం నివాళులర్పించలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల పక్షాన భూమిp ఆకాశం కదిలేలా అయినా పోరాటం చేసి కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామని తెలిపారు. 

రైతులకు పరామర్శ 

నల్లగొండ పట్టణానికి సమీపంలోని అర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులను కేసీఆర్ పరామర్శించారు. ధాన్యాన్ని తీసుకొచ్చి 25 రోజులవుతున్నా కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు వాపోయారు. బీఆర్‌ఎస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేవని, సాగునీటి సమస్యలు లేవని తెలిపారు. దీంతో రైతులు అధైర్యపడొద్దని, సమస్యలపై పోరాడతానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కాగా, మిర్యాలగూడ రోడ్ షోకు వెళ్తున్న సమయంలో కేసీఆర్ కాన్వాయ్‌లోని ఒక వాహనం వేములపల్లి వద్ద అదుపుతప్పి ముందు వాహనాన్ని ఢీకొంది. సడెన్ బ్రేక్ వేయడంతో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. దీంతో కాన్వాయ్‌లోని పలు వాహనాలు దెబ్బతిన్నాయి.   

అట్టహాసంగా యాత్ర ప్రారంభం

కేసీఆర్ బస్సుయాత్ర బుధవారం ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో ఆయనకు పార్టీ మహిళా నేతలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం తెలంగాణ భవన్ సౌత్‌గేట్ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి బీఆర్‌ఎస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. రాష్ట్రమంతా 17 రోజులపాటు సాగే యాత్ర మే 10వ తేదీన ముగుస్తుంది. సిద్దిపేట సభతో యాత్ర ముగుస్తుంది.