పంద్రాగస్టున చూస్తా

25-04-2024 02:56:33 AM

n హరీశ్.. నీ మామ కేసీఆర్‌లా మాట తప్పొద్దు

n ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ 

n సభకు రాని కేసీఆర్ టీవీల్లో ప్రగల్భాలు

n తోక తెగిన బల్లుల్లా మామా అల్లుళ్లు

n మేడిగడ్డ మేడిపండు.. సుందిళ్ల సున్నా

n అన్నారం ఆకాశంలో కలిసిపోయింది

n కేసీఆర్ దమ్ముంటే కాళేశ్వరం వద్ద చర్చకు రా

n వరంగల్ జనజాతర సభలో సీఎం రేవంత్ 

హనుమకొండ/ఏప్రిల్ 24 (విజయక్రాంతి): రైతులకు ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు.. తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకొని జేబులో పెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టంచేశారు. బుధవారం హనుమకొండ జిల్లా మడికొండలో కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం ప్రసంగించారు. ఆగస్టు 14 రాత్రికే రైతులకు రుణమాఫీ చేస్తామని, 15న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. మామ (కేసీఆర్)లాగా మాట తప్పొద్దని హెచ్చరించారు. రామప్ప శివుడు, మేడారం సమ్మక్క వేయిస్తంభాల దేవుళ్ల సాక్షిగా రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇస్తున్నట్టు ప్రకించారు.

కాళేశ్వరం వద్ద చర్చకు సిద్ధమా?

అధికారం పోవటం మామా అల్లుళ్లు కేసీఆర్, హరీశ్‌రావు భరించలేకపోతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలన వైఫల్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మెదడును కరగదీసి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని కేసీఆర్ అంటున్నారు. కాళేశ్వరాన్ని రూ.లక్ష కోట్లు పెట్టి నిర్మించారు. మేడిగడ్డ మేడిపండు అయ్యింది. సుందిళ్ల సున్నా అయ్యింది.

అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, భీమా, దేవాదుల ప్రాజెక్టులను చూడండి.. ఎంత బలంగా నిర్మించామో. కేసీఆర్‌ను సూటిగా అడుగుతున్నా. కాళేశ్వరం రండి చూద్దాం. అక్కడే కూర్చొని నిపుణులతో చర్చిద్దాం. కేసీఆర్‌కు దమ్మూ, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం రావాలి’ అని సవాల్ చేశారు. అసెంబ్లీకి రావటం చేతగాని కేసీఆర్.. టీవీ చానళ్లలో గంటలకు గంటలు కూర్చొని ముచ్చట్లు చెప్తున్నారని ఎద్దేవాచేశారు. మంగళవారం కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల్ల బీఆర్‌ఎస్‌కు ఎక్కడా డిపాజిట్లు కూడా రావని స్పష్టంచేశారు. 

వరంగల్‌కు రింగురోడ్డు

బీఆర్‌ఎస్ పాలనలో వరంగల్ ప్రాంతం ఎంతో నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ ఆరోపించారు. వరంగల్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకొంటానని చెప్పారు. ‘వరంగల్‌కు రింగురోడ్డు నిర్మిస్తాం. విమానాశ్రయం నిర్మిస్తాం. బీఆర్‌ఎస్ పాలనలో కాకతీయ యూనివర్సిటీ నిర్వీర్యమైపోయింది. వర్సిటీకి వీసీతోపాటు బోధనా సిబ్బందిని నియమిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తాం. ఈ నగరానికి మహర్ధశ తీసుకొచ్చే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చారు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా కడియం కావ్యను గెలిపిస్తే కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి రెండో రాజధాని అయ్యేందుకు వరంగల్‌కు అన్ని అర్హతలున్నాయని చెప్పారు. 

మోదీ మత రాజకీయం

ప్రధాని నరేంద్రమోదీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకపోగా, ఇప్పుడు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని సీఎం విమర్శించరాఉ. దేశ సంపదను అంబానీ, అదానీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ భూముల అనకొండ అని విమర్శించారు. వరంగల్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖామంత్రి సీతక్క తెలిపారు. యువతకు ఉద్యోగాలు, పేదలకు ఇండ్లు కట్టించటమే తమ ప్రాధాన్యతలని మంత్రి కొండా సురేఖ చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ నేత రోహిత్‌చౌదరి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.