అభినయంలో ఆణిముత్యాలు
నేటి ఆధునిక యువత పాశ్చాత్య సంస్కృతి వైపు పరుగులు తీస్తుంటే, సెల్‌ఫోన్లు, సోషల్ మీడియా ప్రపంచంలోనే విహరిస్తుంటే.. ఈ కవలలు మాత్రం భారతీయ సనాతన సంప్రదాయ కళకు ప్రాణం పోస్తున్నారు. ఒకవైపు అత్యున్నత వృత్తివిద్యా కోర్సులు అభ్యసిస్తూనే, మరోవైపు మువ్వల సవ్వడితో కూచిపూడి నాట్యరంగంలో శిఖరాలు అధిరోహిస్తున్నారు. పసితనంలోనే అభినయానికి శ్రీకారం చుట్టి, దేశ విదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలతో ప్రశంసలు అందుకుంటున్న ఆ అద్భుత కవలలే.. హైదరాబాద్, కూకట్‌పల్లికి చెందిన క్రోవి తన్మయి శ్రుతి, క్రోవి తేజోమయి స్వాతి. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుని యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రాంకీ పెరల్ విల్లాస్‌కు చెందిన వ్యాపారవేత్త క్రోవి విష్ణువర్ధన్, గృహిణి మాధవీలత దంపతుల కుమార్తెలు తన్మయి, తేజోమయి. చిన్ననాటి నుంచే పిల్లల్లో ఉన్న కళాభిరుచిని గమనించిన ఆ తల్లిదండ్రులు వారిని ఎంతో ప్రోత్సహించారు. ఏడేళ్ల వయసులోనే ప్రముఖ నాట్య గురువు, దూరదర్శన్ న్యాయనిర్ణేత డాక్టర్ ఆర్ ప్రసన్నరాణి వద్ద కూచిపూడిలో ఓనమాలు దిద్దారు. నాట్యం పట్ల వారికి వున్న కఠోర సాధనతో శిల్పకళా వేదికలో అత్యద్భుతంగా కూచిపూడి అరంగేట్రం చేశారు. ఆ అరంగేట్రంలో వారు ప్రదర్శించిన భామకలాపం, అర్ధనారీశ్వరం నృత్యాలు వారికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.
చదువులో రాణిస్తూనే..
నాట్య సాధన అంటే గంటల తరబడి శ్రమతో కూడుకున్న పని. దానికి చదువును సమన్వయం చేసుకోవడం కత్తిమీద సామే. కానీ, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఈ సోదరీమణులు చదువులోనూ ఎప్పుడూ ముందంజలోనే ఉండేవారు. ఓక్రిడ్జ్ స్కూల్ స్థాయిలో జరిగిన సోలో డ్యాన్స్ పోటీల్లో ప్రథమ బహుమతులు సాధించారు. ప్రస్తుతం తన్మయి శ్రుతి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, తేజోమయి స్వాతి అమిటీ యూనివర్సిటీలో బీబీఏ మూడవ సంవత్సరం చదువుతోంది. ఒకరు వైద్య వృత్తిలో, మరొకరు వ్యాపార నిర్వహణ రంగంలో రాణిస్తూనే తమకు ప్రాణప్రదమైన నాట్యకళకు రోజూ సమయం కేటాయిస్తుండటం వారి క్రమశిక్షణకు అద్దం పడుతోంది.
ఉద్ధండులైన గురువుల వద్ద శిక్షణ
కూచిపూడితో పాటు ఇతర సంప్రదాయ నృత్య రీతులను అభ్యసించాలన్న తపనతో వీరు ఎందరో ఉద్ధండులైన గురువుల వద్ద శిక్షణ పొందారు. ప్రముఖ నాట్య గురువు ఓలేటి రంగమణి వద్ద సింహనందిని, మయూర కౌత్వం లాంటి అరుదైన ఆలయ నృత్యాలను నేర్చుకుని అద్భుతంగా ప్రదర్శించారు. చలసాని లోహిత వద్ద సీతాకల్యాణం, పార్వతీ కల్యాణం వంటి హరికథలతో పాటు నట్టువాంగంలో సైతం శిక్షణ పొందారు. సిద్ధేంద్ర గురువు వద్ద గొల్లకలాపం నాట్యాన్ని అభ్యసించి, పవిత్ర యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో ప్రదర్శించి భక్తుల మన్ననలు పొందారు.
నృత్య దర్శకులు కేవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఎన్నో ప్రతిష్టాత్మక బ్యాలే నృత్య రూపకాలలో ఈ సోదరీమణులు జీవించారు. గోదా కల్యాణం, ఆముక్తమాల్యద, శివలీలలు, మోహినీ భస్మాసుర, కళార్చన వంటి నృత్య రూపకాలలో.. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, మోహిని, సత్యభామ వంటి స్త్రీ పాత్రలతో పాటు బ్రహ్మ, పరమశివుడు వంటి వైవిధ్యమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆహూతులను అలరించారు.
వెయ్యికి పైగా ప్రదర్శనలు
ఇప్పటివరకు ఈ కవలలు దేశ, విదేశాల్లో ఏకంగా వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఢిల్లీలోని ఆంధ్రా భవన్, తిరుమల నాదనీరాజనం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీకాకుళం పుణ్యక్షేత్రం, హైదరాబాద్‌లో ఏటా జరిగే కోటి దీపోత్సవం మూడేళ్లుగా తదితర ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు.. నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్, శిల్పారామం, రవీంద్రభారతి, త్యాగరాయ గానసభ, టెస్కాఫ్ వేదికలపై వీరి నాట్య ప్రదర్శనలు ఎంతోమందిని మంత్రముగ్ధులను చేశాయి. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ’108 అష్టోత్తర గురు మహా బృందనాట్యం’లో పాల్గొని గిన్నిస్ వరల్ రికార్డ్లో సైతం తమ పేరును సగర్వంగా లిఖించుకున్నారు.
యూకే లండన్ లోని యుక్త అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన ఇచ్చి ఘన సత్కారం పొందారు. వీరి ప్రతిభాపాటవాలు బుల్లితెర టీవీ ఛానళ్ల ప్రేక్షకులను సైతం కట్టిపడేశాయి. యాదగిరి టీవీలో అందెల రవళి డ్యాన్స్ ప్రోగ్రామ్, ఆలాపన సాంగ్స్లో అదరగొట్టిన ఈ కవలలు.. ఈటీవీ అభిరుచి, జీ తెలుగు దేనికైనా రెడీ, జెమినీ టీవీ బోల్ బేబీ బోల్, భక్తి టీవీ, స్టూడియో వన్ శ్రీరామనవమి ప్రత్యేకం, హెచ్‌ఎంటీవీ మదర్స్ డే, వీ6, దర్శనం, 99 టీవీ, మెట్రో ఛానల్ వంటి దాదాపు అన్ని ప్రముఖ టీవీ ఛానళ్లలో తమ ప్రదర్శనలు, ఇంటర్వ్యూలతో విశేష ప్రేక్షకాదరణ పొందారు.
సంగీతం, చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం
కేవలం నాట్యమే కాకుండా సంగీతం, చిత్రలేఖనంలోనూ వీరికి అపారమైన ప్రావీణ్యం ఉంది. గాయని సునంద వద్ద సంగీతం నేర్చుకుంటున్న వీరు, హిందూ ధర్మం ఛానల్‌లో గాత్ర ప్రదర్శన ఇచ్చారు. శేషిభూషణ్ వద్ద పెయింటింగ్ నేర్చుకుని, తమ తీరిక సమయాల్లో గీసిన అద్భుతమైన చిత్రాలతో పలు ఆర్ట్ ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేసి బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.
తాము నేర్చుకున్న కళ తమతోనే ఆగిపోకూడదని, నలుగురికీ పంచాలన్న సత్సంకల్పంతో ఈ కవలలు ఐదేళ్ల క్రితం క్రోవి సిస్టర్స్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ని స్థాపించారు. చదువుల ఒత్తిడిలోనూ సమయాన్ని కేటాయించుకుంటూ ప్రస్తుతం 13 మంది విద్యార్థులకు ఉచితంగా కూచిపూడిలో శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్తులో కూచిపూడిలొ డాక్టరేట్ సాధించడమే తమ జీవిత లక్ష్యమని సోదరీమణులు ఆత్మవిశ్వాసంతో చెపుతున్నారు.
హైదరాబాద్ సిటీ బ్యూరో, విజయక్రాంతి
బిరుదులు, అవార్డులు
వీరి ప్రతిభకు జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థల నుంచి లెక్కలేనన్ని బిరుదులు, అవార్డులు వరించాయి. బాల పరిమళాలు, బాలరత్న, బాల పారిజాతం, బాల కళానిధి, బాల మిత్ర, నాట్య మయూరి, ఉగాది రసమయి బాలల పురస్కారం, కళాపీఠం ట్విన్స్, ప్రైడ్ ఆఫ్ కళాపీఠం లాంటి పురస్కారాలు పొందారు.
వీటితో పాటు మిరాకిల్ అవార్డ్, గాన కోకిల, సంస్కార నృత్య బాటసారి, సంస్కార నృత్యాన్వేషి, సంస్కార రత్నం, కేసీపీ కోనసీమ చిత్రకళా అవార్డ్, కృష్ణదేవరాయల అవార్డ్, నాట్య వేదం, నాట్య విశారద, నాట్య రంజని వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సగర్వంగా దక్కించుకున్నారు. 18వ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో, సిలికానాంధ్ర 3 వరల్ రికార్డ్సో్ల ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.




