5 May, 2026 | 4:11 AM

దీదీ.. సారీ!

05-05-2026 01:39 AM
  1. పశ్చిమ బంగాల్‌లో తృణమూల్‌కు ఘోర పరాజయం
  2. ఆర్జీకర్ జూడాపై హత్యాచారం ఘటనతో అప్రతిష్ఠ
  3. మహిళల భద్రత ప్రశ్నార్థకమవడం ప్రధాన కారణం
  4. బంగ్లాదేశ్ నుంచి వలసలు, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలూ మైనస్ 

కోల్‌కత్తా, మే ౪: పశ్చిమ బంగాల్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం అజేయ శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కోటలు బద్దలయ్యాయి. మమతా బెనర్జీ నేతత్వంలోని 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. రాష్ర్టంలో పెరిగిన అవినీతి ఆరోపణలు, మహిళా భద్రతపై నెలకొన్న ఆందోళన లు పార్టీ పతనానికి ప్రధాన కారణాలు. ప్రతిపక్షాల వ్యూహాత్మక పోరాటం ముందు అధికా ర తృణమూల్ పార్టీ నిలవలేకపోయింది. కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత సువేం దు అధికారి వంటి నేతల నాయకత్వంలో పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసింది. 

బీజేపీ పక్కా వ్యూహం

కేంద్ర మంత్రి అమిత్‌షా స్వయంగా 152కి పైగా నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించారు. దీన్నిబట్టి బీజేపీ ఏ స్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టిందనేది అర్థం చేసుకోవచ్చు. ప్రజలు తమకు మద్దతు ఉన్నారని అంచనా వేసి ప్రధాని మోదీ కూడా విస్తృతంగా పర్యటించారు. కుదిరిన చోటల్లా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫలితంగా రాష్ట్రంలో పోలింగ్ రికార్డ్ స్థాయిలో 92శాతం వరకు నమోదైంది. బంగాల్‌లో 70శాతం ఉన్న హిందూ ఓటర్ల ఏకీకరణే లక్ష్యంగా బీజేపీ పనిచేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను దృష్టిలోపెట్టుకొని వ్యూహాలను అమలు చేసింది. 

టీఎంసీ ఓటమికి ప్రధాన కారణాలు

టీఎంసీ ఘోర పరాజయానికి ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం, హింసాత్మక ఘటనలు, ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు ఓటమికి ప్రధాన కారణాలు. ముఖ్యంగా జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన మమతా ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతను తెచ్చింది. ఈ కేసులో నిందితులను కాపాడేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో మహిళల భద్రత కరువైందనే భావన ఓటర్లలో బలంగా నాటుకుంది. 

బంగాల్‌లో టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం, రేషన్ స్కామ్ వంటి అక్రమాలు సుప్రీంకోర్టు వరకు చేరడం మమత ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అనుచరుల ఇళ్లలో కోట్లాది రూపాయల నగదు లభించడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. ‘శారద, నారద’ వంటి పాత కుంభకోణాలు కూడా టీఎంసీకి మైనస్ అయ్యాయి. మొత్తానికి టీఎంసీ నేతలు అవినీతిపరులనే ముద్ర వేయడంలో బీజేపీ విజయం సాధించింది.

నిరుద్యోగం పెరిగిపోవడం, అభివృద్ధి పనులు నిలిచిపోవడం వంటి అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. టీఎంసీ నాయకుల దౌర్జన్యాలు, అవినీతి.. అక్రమాలు, గూండాయిజం పెరిగిపోవడంపై సామాన్య ప్రజలు విసిగిపోయారు. 

బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల వ్యవహారం టీఎంసీకి తీరని నష్టం కలిగించింది. అక్రమంగా వచ్చిన వారు ఓటు హక్కు పొంది స్థానిక జీవనోపాధిని దెబ్బతీస్తున్నారనే వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. 

టీఎంసీకి పడాల్సిన ముస్లిం ఓట్లు కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్‌ఎఫ్ మద్దతు దారుల ఓట్లు చీలిపోవడం కూడా టీఎంసీ పతనానికి దారితీసింది.