బెంగాల్ సీఎంగా దీదీ అనుచరుడు!
- ముఖ్యమంత్రి రేసులో సువేందు అధికారి?
- ఆయన వైపే మొగ్గు చూపుతున్న బీజేపీ అధిష్ఠానం!
- టీఎంసీలో మమతతో కుడి భుజంగా సువేందు
- విభేదాలతో 2020లో రాజీనామా
- అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిక
కోల్‌కతా, మే 4: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అధికారం చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ క్రమంలో ముఖ్య మంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం విపక్ష నేతగా ఉన్న సువేందు అధికారి సీఎంగా పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో మమతా బెనర్జీ ప్రధాన అనుచరుడిగా ఉన్న సువేందు.. టీఎం సీ పార్టీలో మమత మేనల్లుడి పెత్తనం నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ నుంచి బెంగాల్ చరిత్రలోనే తొలి సీఎంగా రికార్డును సృష్టించనున్నట్టు తెలుస్తోంది.
రాజకీయ ప్రస్థానం
సువేందు అధికారి 1970లో తూర్పు మేదినీపుర్ జిల్లాలోని ఒక బలమైన రాజకీయ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శిశిర్ అధికారి మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు 1995 లో కాంగ్రెస్ తరఫున కాంధీ మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా గెలిచి గెలిచి తన రాజకీయ ప్రస్థా నం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1998లో మమతా బెనర్జీ టీఎంసీని స్థాపించినప్పుడు ఆమెతో కలిసి నడిచారు. 2006లో కాంధీ దక్షి ణ్ స్థానం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో తమలుక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
నందిగ్రామ్ పోరాటంతో- కీలక మలుపు
సువేందు రాజకీయ జీవితంలో నందిగ్రా మ్ ఉద్యమం అత్యంత కీలకమైనది. 2007లో సెజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన రైతు పోరాటంలో ఆయన ముందుండి నడిచారు. రైతుల భూములు కాపాడటానికి మమతా బెనర్జీతో కలిసి పోరాడారు. మమతకు ప్రధాన అనుచరుడిగా, పార్టీలో రెండో అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగారు. వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించి, 2011లో టీఎంసీ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యం. అయితే టీఎంసీ పార్టీలో అంతర్గత పరిణామాలు,
ముఖ్యంగా మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత పెరగడంతో మమతతో సువేందుకు విభేదాలు మొదలయ్యాయి. 2020లో టీఎంసీతో 22 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి సీఎం మమతా బెనర్జీని ఓడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లు సాధించగా.. సువేందు అసెంబ్లీలో విపక్ష నేతగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో వ్యూహాత్మక విజయం
ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టీఎంసీ బలాబలాలు పూర్తిగా తెలిసిన నేత కావడంతో, బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. చొరబాట్ల అంశంపై టీఎంసీ వైఖరిని ఎండగడుతూ ప్రజల మద్దతు కూడగట్టారు. తాజాగా సాధించిన ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించి, ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా నిలిచారు.






