26 July, 2026 | 2:13 AM

డిజిటల్ భారత్‌కు సైబర్ సవాళ్లు

26-07-2026 12:00 AM

జి.శ్రీలత :

డిజిటల్ విప్లవం మన జీవితాలను మరింత సులభతరం చేసింది. బ్యాంకింగ్ నుంచి వ్యాపారం వరకు, విద్య నుంచి వైద్యం వరకు, ప్రభుత్వ సేవల నుంచి వ్యక్తిగ త లావాదేవీల వరకు అన్నీ స్మార్ట్‌ఫోన్ చేతిలోకి వచ్చాయి. కానీ, ఈ డిజిటల్ సౌకర్యాలతోపాటు ఒక భయంకరమైన ముప్పు కూడా పెరిగింది. అదే సైబర్ నేరాలు. ఒకప్పుడు ఇంటి తలుపులు బద్దలుకొట్టి దొంగతనం చేసే నేరగాళ్లు ఇప్పుడు ఇంట్లోకి అడుగుపెట్టకుండానే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఒక ఫోన్‌కాల్, ఒక మెసేజ్, ఒక లింక్, ఒక యాప్ చాలు. క్షణాల్లో జీవితకాల పొదుపులు మాయమవుతున్నాయి.

హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గంటకు సుమా రు రూ.10 లక్షలు, రోజుకు రూ.2.4 కోట్ల మేర సైబర్ నేరగాళ్లు నగరవాసుల నుంచి దోచుకుంటున్నారనే తాజా నివేదికలను చూస్తుంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతున్నది.

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే సుమారు రూ.439 కోట్లను ప్రజలు కోల్పోవడం కేవలం గణాంకాలు కావు, వేలాది కుటుంబాల ఆర్థిక భద్రత, మానసిక ప్రశాంతతపై పడిన గట్టి దెబ్బ. కేసుల సంఖ్య తగ్గినా నష్టపోయే సొమ్ము తగ్గకపోవడం మరింత ప్రమాదకరమైన పరిణామం.అంటే ఇప్పుడు నేరగాళ్లు చిన్న మొత్తా ల కోసం కాదు, పెద్ద మొత్తాలపై కన్నేశారు.

ఇది సాధారణ మోసం కాదు, అత్యంత ప్రణాళికాబద్ధంగా సాగుతున్న ఆర్థిక నేరం. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు యాదృచ్ఛికంగా ఫోన్లు చేయడం లేదు. ముందుగానే వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో ఎక్కువ డబ్బు ఉన్నవారిని గుర్తిస్తున్నారు. వారి వయస్సు, ఉద్యోగం, పెట్టుబడులు, ఆర్థిక స్థితి వంటి వివరాలను విశ్లేషించి లక్ష్యం గా ఎంచుకుంటున్నారు.

ఒకప్పుడు ‘ఫిషింగ్’ ప్రధాన ఆయుధమైతే, ఇప్పుడు ‘టార్గెటెడ్ సోషల్ ఇంజినీరింగ్’ ప్రధాన వ్యూహంగా మారింది. ప్రస్తుతం ఎక్కువగా పెట్టుబడుల పేరుతో మోసాలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్‌లు, డిజిటల్ అరెస్టులు, నకిలీ కస్టమ ర్ కేర్ కాల్స్, లోన్ యాప్ మోసాలు, కేవైసీ అప్డేట్ పేరుతో మోసాలు ప్రధానంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అధిక లాభాల ఆశచూపుతూ నకిలీ పెట్టుబడి యాప్‌లలో డబ్బు పెట్టించే ముఠాలు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

ఇంకో ఆందోళనకర అంశం డిజిటల్ అరెస్టుల మోసాలు. పోలీసులమని, సీబీఐ అధికారులమని, ఈడీ అధికారులమని, ఆదాయపన్ను శాఖ అధికారులమని చెప్పి వీడియో కాల్స్ చేస్తూ భయపెట్టి డబ్బు బదిలీ చేయించుకుంటున్నారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు, విదేశాల్లో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ తరహా మోసాలకు ఎక్కువగా గురవుతున్నారు. భయం, అవగాహన లోపం, ప్రభుత్వ సంస్థలపై ఉన్న గౌరవాన్ని సైబర్ నేరగాళ్లు ఆయుధంగా మార్చుకుంటున్నారు.

ఈ పరిస్థితికి మరో ప్రధాన కారణం వ్యక్తిగత డేటా భద్రతలో ఉన్న లోపాలు. బ్యాం కులు, కాల్ సెంటర్లు, థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు, మార్కెటింగ్ ఏజెన్సీల వద్ద ఉన్న వినియోగదారుల సమాచారం ఎలా లీక్ అవుతోందనే అంశంపై మరింత కఠినమైన విచారణ అవసరం. వ్యక్తిగత సమాచారం మార్కెట్లో సరుకులా మారితే, సైబర్ నేరాలను అరికట్టడం అసాధ్యం.

ప్రభుత్వాలు, పోలీసు శాఖలు కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక దర్యాప్తు బృం దాలు, డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, అంతర్రాష్ట్ర సమన్వయం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల కేంద్ర హోంశాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ ప్రవేశపెట్టిన మనీ రీస్టోరేషన్ మాడ్యుల్ (ఎంఆర్‌ఎం) కూడా బాధితులకు త్వరగా డబ్బు తిరిగి అందించే దిశగా ఒక మంచి ముందడుగు. మోసపూరిత లావాదేవీలను వేగంగా గుర్తించి ఖాతాలను నిలిపివేసి, రిఫండ్ ప్రక్రియను సరళతరం చేయడం ద్వారా బాధితులకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది.

అయితే వ్యవస్థలు ఉంటేనే సరిపోదు. వాటిపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలి. మోసపోయిన వెంటనే ఫిర్యాదు చేయకపోతే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. ప్రతి పౌరుడు అత్యవసర సైబర్ హెల్ప్‌లైన్, ఆన్‌లైన్ ఫిర్యాదు విధానం, బ్యాం కుకు వెంటనే సమాచారం ఇవ్వాల్సిన అవసరం వంటి అంశాలను తెలుసుకోవాలి. సమయానికి స్పందిస్తే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.

సైబర్ నేరాలను అరికట్టాలంటే పోలీసుల బాధ్యత ఒక్కటే కాదు. బ్యాంకులు కూడా అనుమానాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించే ఏఐ ఆధారిత వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. అసాధారణ లావాదేవీలు జరిగితే వెంటనే వినియోగదారులకు హెచ్చరికలు పంపాలి. టెలికాం సంస్థలు నకి లీ కాల్స్, స్పూఫింగ్, అంతర్జాతీయ మోసపూరిత నంబర్లను మరింత సమర్థంగా నిరోధించాలి.

సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా నకిలీ ప్రకటనలు, మోసపూరిత పెట్టుబడి లింకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థలో కూడా సైబర్ భద్రతకు ప్రాధాన్యం పెరగాలి. పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ లిటరసీ, సైబర్ సేఫ్టీ, ఆన్‌లైన్ మోసాలను గుర్తించే పాఠాలను చేర్చాల్సిన సమయం వచ్చింది. ఒకప్పుడు ట్రాఫిక్ నియమాలు నేర్పినట్లే, ఇప్పుడు డిజిటల్ భద్రత కూడా తప్పనిసరి జీవిత నైపుణ్యంగా మారింది.

అత్యంత ముఖ్యమైన విషయం వ్యక్తిగత అప్రమత్తత. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటీపీ, పిన్, సీవీవీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పకూడదు. అపరిచిత లింకులపై క్లిక్ చేయకూడదు. అనుమానం వస్తే సంబంధిత సంస్థ అధికారిక నంబర్‌కు స్వయంగా కాల్ చేసి ధ్రువీకరించుకోవాలి.

డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, సైబర్ నేరగాళ్ల వ్యూహాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. అందువల్ల సాంకేతికతను ఎదుర్కోవడానికి సాంకేతికతే ఆయుధంగా మారాలి. కృత్రిమమేధ ఆధారిత మోసాల గుర్తింపు వ్యవస్థలు, డేటా భద్రత చట్టాల కఠిన అమలు, అంతర్జాతీయ సమన్వయం, ప్రజల్లో నిరంతర అవగాహన, వేగవంతమైన న్యాయ ప్రక్రి య.. ఈ ఐదు స్తంభాలపైనే భవిష్యత్తు సైబర్ భద్రత ఆధారపడి ఉంటుంది.

చివరగా చెప్పాలంటే, సైబర్ నేరాలు ఇక పోలీసు శాఖ సమస్య మాత్రమే కాదు; అది దేశ ఆర్థిక వ్యవస్థకు, పౌరుల నమ్మకానికి, డిజిటల్ అభివృద్ధికి ఎదురైన అతిపెద్ద సవాలు. ప్రతి రోజు కోట్ల రూపాయలు దోచుకుపోతున్నా మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే, రేపటి డిజిటల్ భారత నిర్మాణానికి అది తీవ్రమైన ముప్పుగా మారుతుంది.

అందుకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. బ్యాంకులు తమ భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. సంస్థలు వినియోగదాడేటా గోప్యతను కాపాడాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాలపై విజయం సాధించాలంటే చట్టం, సాంకేతికత, సామాజిక అవగాహన, వ్యక్తిగత జాగ్రత్త.. ఈ నాలుగూ కలిసి పనిచేయాల్సిందే.

 వ్యాసకర్త: జర్నలిస్టు, 6300560191