26 July, 2026 | 2:15 AM

యువత సాధించిన విజయమిది!

26-07-2026 12:00 AM

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలతో పురుడుపోసుకున్న ‘బొద్దింకలు’ దేశంలో వ్యవస్థలపై దాడిచేయటం కాదు, వ్యవస్థలను ప్రక్షాళన చేయటానికి రాజీలేని పోరాటం చేస్తామని నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై చేసిన పోరాటంతో నిరూపించారు. దేశంలోనూ, ఏదో ఒక రాష్ట్రంలో తరచూ అకాడమిక్ పరీక్ష పత్రాలు, పోటీ పరీక్షల పత్రాలు, ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష పత్రాలు లీక్ అవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కాబట్టి దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థని ప్రక్షాళన చేయకపోతే యువత, విద్యార్థులు, నిరుద్యోగులు వ్యవస్థలపై నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. 

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దేశ జెన్ జీ యువత చేసిన ఉద్యమంపై రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా పరీక్షల నిర్వహణ వ్యవస్థలో ఉన్న లోపాలపై చర్చలకి, తీసుకోవాల్సిన చర్యలకి నాంది పలికినట్లుగానే కనిపిస్తున్నది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్‌కి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రారంభమైన ఉద్యమం పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షతో పాటు, జూలై 20న పార్లమెంటుని ముట్టడి చేసే ప్రయత్నంతో యువత కేంద్ర ప్రభుత్వానికి గట్టి సవాల్ విసిరారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామాతో వారి పోరాటం ఫలించింది.

నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో తీసుకువచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాల కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో 750 మంది రైతులు మరణించారు. 15 నెలలు పోరాడిన రైతుల ఉద్యమానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను ఉపసంహరించుకోవటమే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకి క్షమాపణలు చెప్పారు. నాటి రైతు ఉద్యమ తరహాలోనే నేడు ఢిల్లీలో విద్యార్థులు చేసిన ఉద్యమం మరి కొంతకాలం కొనసాగితే మంచిది కాదనే ఉద్దేశంతో ఆలస్యంగానైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు విద్యార్థి ఉద్యమ నాయకుల ఇతర డిమాండ్ల పట్ల కూడా సానుకూలత వ్యక్తం చేయడం ముదావహం.

సవాల్ విసిరిన ‘కాక్రోచ్’

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతకు పెద్దపీట వేయాలని, లీక్ తరువాత ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలకి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించిన ఉద్యమాన్ని మొదట్లో ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. మే 12 నుంచి జూలై 20 పార్లమెంట్ ముట్టడించే ప్రయత్నం వరకు యువత చేసిన విద్యార్థి ఉద్యమంపై ప్రధానమంత్రి మాటమాత్రంగానైనా స్పందించలేదు. విద్యా ర్థి ఉద్యమ నాయకులను చర్చలకు కూడా పిలవలేదు.

కానీ, వివాదానికి కేంద్రబిందువైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థి ఉద్యమకారులను ఉద్దేశిం చి, వారు టెర్రరిస్టులకు బీ టీం అని వ్యాఖ్యానించారు. రైతు ఉద్యమం వెనకాల సంఘ విద్రోహ శక్తుల హస్తం, విదేశీ శక్తుల ప్రోద్బ లం ఉందని గతంలో ప్రభుత్వం ఎలా ప్రచా రం చేసిందో, విద్యార్థి ఉద్యమం వెనుక కూడా జాతి వ్యతిరేక శక్తుల హస్తం ఉందని ప్రభుత్వం ప్రచారం చేసింది. రహదారుల నిర్బంధం, మెట్రో సర్వీసెస్, ఇంటర్నెట్ నిలిపివేత లాంటి అడ్డంకులను అధిగమించి వేలాదిమంది విద్యార్థులు జూలై 20న పార్లమెంటు ముట్టడిలో పాల్గొనడంతో ఉద్యమ నాయకుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

లాఠీచార్జ్‌తో ఉద్యమం ఉధృతి

సంసద్ ముట్టడికి వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులను అదుపు చేసే క్రమంలో ఢిల్లీ పోలీసులు, రిజర్వ్ ఆర్మీ ఫోర్సెస్ విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేయటంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థుల పట్ల దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైంది. లాఠీచార్జ్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు, ముఖ్యంగా ఢిల్లీ అడిషనల్ డీసీపీ సందీప్ లాంబా విద్యార్థినుల పట్ల వ్యవహరించిన తీరు ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉంది. కాబట్టే స్పందించిన ప్రభుత్వం సందీప్ లాంబాపై బదిలీ వేటు వేశారంటే పోలీసు ల ప్రవర్తన ఎంత అభ్యంతరకరంగా, హింసాత్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాయుధులు అయిన పోలీసులు,

ఆర్‌ఏఎఫ్ బలగాలు సంసద్ ముట్టడి సందర్భంగా విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేయడం తో దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతమైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం అవుతుందా, ఉద్యమంలో సంఘవిద్రోశక్తులు ఉన్నారని ప్రచారం చేసిన ప్రభుత్వం ఉద్యమకారుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకపోగా, విద్యార్థులపై పెల్లెట్ గన్స్, మేకులు కొట్టిన లాఠీలను ఉపయోగించటం, భాష్పవాయువుని ప్రయోగించి ఉద్యమాన్ని అణచివేయాలనే ప్రయత్నాలని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.

సంసద్ ముట్టడి సందర్భంగా లాఠీచార్జితో తీవ్రంగా గాయపడిన విద్యార్థులు వెనకడుగు వేయకుండా మళ్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షను కొనసాగించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాసం వద్ద నిరసనకి దిగారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒత్తిడికి గురైన ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చించటానికి, విద్యార్థి ఉద్యమ నాయకులతో సంప్రదింపులు చేయటానికి చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటం, మరొకవైపు విద్యార్థుల దీక్షలు కొనసాగుతుండటంతో విద్యార్థి ఉద్యమకారుల డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.

నెరవేరిన జెన్ జీ డిమాండ్లు

లీకేజీ వ్యవహారంతో ఉత్పన్నమైన నష్ట నివారణ చర్యలలో భాగంగా ప్రభుత్వం విద్యార్థి ఉద్యమ నాయకులైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంఖాలను చర్చలకి ఆహ్వానించింది. మరొకవైపు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలకి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సంసద్ ముట్టడి సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోటానికి, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకి ఎక్స్‌గ్రేషియా చెల్లించటానికి ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్‌ను రక్షించుకోవడానికి ప్రభుత్వం చివరి వరకు ప్రయత్నం చేసినా ప్రతిపక్షాలు, విద్యార్థి ఉద్యమ నాయకులు ఆయన రాజీనామా కోసం గట్టిగా పట్టుబట్టారు.

ఈ నేపథ్యంలో విద్యార్థి నాయకులు విధించిన 24 గంటల డెడ్‌లైన్‌కి ముం దే జూలై 25న యువత ఆకాంక్షలను గౌరవిస్తూ నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తున్నానని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. పేపర్ లీకేజీకి పాల్పడేవారిని కఠినంగా శిక్షించడానికి 10 సంవత్సరాల జైలు శిక్ష, పది కోట్ల రూపాయల జరిమానా విధించే విధంగా పేపర్ లీకేజీ చట్ట సవరణ బిల్లు, మూడు నెలలలో శిక్షలు ఖరారు చేయటానికి నాలుగు రాష్ట్రాలలో ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. 

అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్యకు పరిష్కారం దొరికినట్లు గా భావించలేం. కానీ, సమస్య పరిష్కారం దిశగా మొదటి అడుగు పడినట్లుగానే భావించాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థి ఉద్యమానికి దక్కిన విజయమని చెప్పక తప్పదు. లక్షలాది మంది విద్యార్థులు రాసే జేఈఈ, నీట్ లాంటి పరీక్షలను ఆరోపణలకి తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించలేకపోవటం ప్రభుత్వాల వైఫల్యమే. పరీక్షల నిర్వహణలో సంస్థాగతమైన మార్పులు, యూపీఎస్సీ మోడల్, కఠినమైన చట్టాలు, శిక్షలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకతకి, జవాబుదారీతనానికి పెద్దపీట వేయకపోతే నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు భవిష్యత్తులో కూడా పునరావృతమయ్యే ప్రమాదం లేకపోలేదు.

 వ్యాసకర్త సెల్: 9885465877