27-01-2026 01:08:09 AM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ’వీడీ14’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ క్రేజీ మూవీకి ‘రణబాలి‘ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం గణతంత్ర దినోత్సవం సంధర్బంగా టైటిల్ గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ఈ వీడియోలో ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 19వ శతాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతోందీ చిత్రం. ఇక తాజాగా విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌లో తన మాతృభూమి కోసం ప్రాణాలొడ్డి పోరాడే రణబాలి పాత్రలో విజయ్ ఒదిగిపోయారు. హీరోయిన్ రష్మిక జయమ్మగా కనిపించింది.
ప్రతినాయకుడు సర్ థియోడోర్ హెక్టార్ పాత్రలో ‘మమ్మీ’ సినిమా ఫేమ్ నటుడు ఆర్నాల్ వోస్లూ నటించారు. పచ్చటి పైరులతో అలరారే మన గ్రామసీమలను బ్రిటీష్ క్రూర పాలకులు కరువు ప్రాంతాలుగా ఎలా మార్చారో ఈ గ్లింప్స్ లో బాధాకరంగా చూపించారు. ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తూ మన సమాజంలో హిట్లర్ ఊచకోతను మించిన మారణహోమాన్ని బ్రిటీషర్స్ ఎలా సృష్టించారో గ్లింప్స్ రిఫ్లెక్ట్ చేసింది. బ్రిటీష్ అధికారిని గుర్రానికి కట్టి రైల్వే ట్రాక్ పై రణబాలి ఈడ్చుకుంటూ వెళ్లే సీన్ గ్లింప్స్ కు హైలైట్ గా నిలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అజయ్-అతుల్; డీవోపీ: నీరవ్ షా; ప్రొడక్షన్ డిజైనర్: శివం రావు నాగసాని; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్; ఆర్ట్: విఠల్ కోసనం; యాక్షన్ కొరియోగ్రఫీ: యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు.