నిరాశపరిచిన సీఎం రేవంత్‌రెడ్డి
- కేసీఆర్‌పై ఎన్ని విమర్శలు చేసినా దండుగే
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్ని వర్గాలను సీఎం రేవంత్‌రెడ్డి నిరాశపరిచాడని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మహబూబ్ నగర్ రైతు పండుగలో రేవంత్ రెడ్డి, మంత్రులు.. కేసీఆర్‌పై ఎన్ని విమర్శలు చేసినా దండుగే అయ్యాయని ఎద్దేవా చేశా రు. ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం రైతాంగాన్ని ఉసూరుమనిపించిందన్నారు.
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి నోరెలా వచ్చిందని నిలదీశారు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదని, నిరూపించేందుకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. లేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రుణమాఫీ, రైతు భరోసా ప్రకటిస్తారని అనుకుంటే మరోసారి మొండిచేయి చూపారని ఎద్దేవా చేశారు. కౌలు రైతులు, ఉపాధి కూలీలు, రైతు బంధుకు అతీగతీ లేదన్నారు. రైతు పండుగ పేరుతో రేవంత్ రెడ్డి రైతులను మాయమాటలతో మరోసారి మోసం చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పేటెంటే అంటూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాదని, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో కోటి 53 లక్షల టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ప్రాజెక్టులు 2014లో కూడా ఉన్నాయని, అప్పుడు 68 లక్షల టన్నుల వరి మాత్రమే ఎందుకు పండిందని ప్రశ్నించారు.
2023 నాటికి కోటి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి ఎలా సాధ్యం అయ్యిందన్నారు. 2014- లక్షా 31 వేల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి 2లక్షల 21 వేల ఎకరాలకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే స్పష్టంగా కనిపించిందన్నారు.
అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని గొప్పలు చెప్పావని, పాలమూరు బిడ్డగా ఇది నీకు న్యాయమా అంటూ నిలదీశారు. ఒకసారి ఫార్మాసిటీ అని, ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అంటూ ఎటు వాటమైతే అటు మాట్లాడటం రేవంత్‌కే చెల్లిందని ధ్వజమెత్తారు. లగచర్ల గిరిజన బిడ్డలను జైలుకు పంపించావని, ఇప్పుడు సొంత జిల్లా ప్రజల మీద మొసలి కన్నీరు కార్చుస్తున్నావని మండిపడ్డారు.
రుణమాఫీ చేస్తానని నూటొక్క దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పాడని విమర్శించారు. పాలమూరుకు ఏం చేశావని కేసీఆర్‌ను ప్రశ్నించే హక్కు రేవంత్‌కు లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో వలసల కు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చిన ఘనత కేసీఆర్ దక్కుతుందని అన్నారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీకి రమ్మని తెగ పిలుస్తున్నాడని, ఆ సమయం కోసమే తాము ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
ఏడాది పాలనలో అన్ని వర్గాలను ఏడిపించడమే తప్ప ప్రజలకు చేసిందేం లేదన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సంవత్సరం పాలన అసలు రంగు బయట పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు.




