ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మద్దతు
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వామపక్షాలు, తెలంగాణ జన సమితి నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, టీజేఎస్ నుంచి కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు తదితరులు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచార సరళిపై సీఎం సమీక్షించారు. వామపక్షాలు, టీజేఎస్ మద్దతు ఇవ్వడంతో మరింత బలం చేకూరిందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
సమావేశం అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం బతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలని, పట్టభద్రులు, సీపీఐ నేతలు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. మార్పు కోసం మనందరం కలిసి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. పట్టభద్రులు ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని ఓటు వేయాలని సీపీఎం నాయకులు వీరయ్య అన్నారు.






