25 May, 2026 | 1:06 AM

ఓటు వేసింది ప్రజలు.. గెలిచిన సతులు..పెత్తనం చేసేది పతులు

25-05-2026 12:00 AM

తాండూర్ మున్సిపల్  సమావేశంలో అపశ్రుతి.  

మహిళా కౌన్సిలర్ల స్థానంలో భర్తల హవా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు

తాండూర్, మే 24, (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులకే అత్యున్నత గౌరవం దక్కాలి. కానీ వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో గత శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, వైస్ చైర్మన్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ఇందుకు విరుద్ధంగా జరిగింది. ఎన్నికైన మహిళా కౌన్సిలర్లను పక్కన పెట్టి, వారి భర్తలను వేదికపై కూర్చోబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన  సమావేశంలో ముగ్గురు మహిళ కౌన్సిలర్లకు బదులుగా వారి భర్తలు వేదికపై కూర్చున్నారు.మహిళా కౌన్సిలర్లు మాత్రం గైర్హాజరయ్యారు  ప్రజల తరఫున ప్రశ్నించి, నిర్ణయాలు తీసుకోవాల్సిన కౌన్సిలర్లు.ఎన్నిక కాని వారి భర్తలు వేదికపై ఆసీనులవడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా మహిళలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించింది మహిళా సాధికారత కోసం. కానీ గెలిచిన మహిళా కౌన్సిలర్లను నామమాత్రం చేసి, భర్తలు పెత్తనం చెలాయించడం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు. అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్ పాటించాల్సిన అధికారులే ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికైన కౌన్సిలర్ ఎవరో, వారికే వేదికపై స్థానం కల్పించాల్సిన బాధ్యత కమిషన్ప ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఎన్నికైన కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళా కౌన్సిలర్ల గౌరవానికి భంగం కలిగించే చర్యలను ఉపేక్షించవద్దని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.   

ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని వివరణ కోరగా శనివారం జరిగింది అధికారిక సమావేశం కాదని పట్టణంలో కొంతమంది ఆర్పీలు ఎస్ ఐ ఆర్ నిర్వహణకు సహకరించడం లేదన్న విషయంపై చర్చ జరిగిందని. మహిళ కౌన్సిలర్లకు అగౌరవపరచాలనె ఉద్దేశం ఆదేశం తమకు లేదని. ..మరోసారి అలా జరగకుండా ప్రోటోకాల్ పాటిస్తామని తెలిపారు.